కూసుమంచి, ఫిబ్రవరి 14 : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్‌లో శనివారం కారు బోల్తా పడి ఒకరు మృతిచెందిన ఘటన చోటుచేసుకున్నది. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన బొగ్గుల శ్రీను (47)గా పోలీసులు గుర్తించారు. శ్రీను హైదరాబాద్‌లో నివాసం ఉంటూ యూ ట్యూబర్‌గా పనిచేస్తున్నాడు.
అనేక సంచలనాలకు నెలవుగా మారిన యూట్యూబ్ చానల్‌కు చెందిన శ్రీను కారులో శవంలా కనిపించడంతో పోలీసులు పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనుతో చదువుకున్న వేణుమాధవరెడ్డికి చెందిన కారుగా గుర్తించారు. 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి కారు బోల్తాపడిన వెంటనే దానినుంచి బయటకు దూకి పరారీ అయినట్టు మత్స్యకారులు చెబుతుండటం గమనార్హం.
కారులో నుంచి ఒక వ్యక్తి దూకి పారిపోవటం, శ్రీను తలకు దెబ్బలు తగిలి కారులో మృతిచెంది ఉండటాన్ని చూస్తే ఎవరైనా చంపివేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను మృతదేహాన్ని నేలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.