మెహిదీపట్నం ఏప్రిల్ 4 : ఆధునిక ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, త్వరలో రూ.ఆరు కోట్లతో యూత్ హబ్‌ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పడు తమ స్కిల్స్‌ను అప్డేట్ చేసుకోవాలని, టీచర్స్కిల్, అప్‌స్కిల్, రీస్కిల్ మంత్రాన్ని మరచి పోకూడదని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కాకపోతే వెనుకబడి పోతామని ఉద్బోధించారు. సోమవారం గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లోని తారామతి బారాదరిలో నిర్వహించిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021-22 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థుల ఆవిష్కరణల ఎగ్జిబిషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బ్రిటిష్ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, యూనిసెఫ్ ప్రతినిధి ఎం మురళీకృష్ణ, హయ్యర్ ఎడ్యుకేషన్, ఐటీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్‌కుమార్ సుల్తానియా, జయేశ్‌రంజన్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత పెద్దఎత్తున విద్య, ఐటీశాఖల సహకారంతో ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆలోచనాశక్తి ఉంటుందని, వారిలోని మేథాశక్తిని వెలికితీయాలని సూచించారు. ఈ సందర్భంగా తన చిన్నతనంలో అమ్మమ్మగారి ఇంటికి వెళ్లినప్పుడు బల్బుల్లోని ఫిలిమెంట్ను తీసి, నీళ్లు పోసి, రకరకాల రంగులు వేస్తూ ప్రయోగాలు చేశానని గుర్తుచేసుకొన్నారు. ఉత్సాహం, ఉత్సుకతతో పిల్లలు చేసే ప్రయోగాలను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థుల్లోని సహజ సృజనాత్మకశక్తిని వెలికితీసి, నూతన ఆవిష్కరణలు చేసేలా విద్యాశాఖ, యూనిసెఫ్, ఇన్క్విలాబ్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు వివరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో 12 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటుతో పాటు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. కొత్త పోకడలు పోతున్న విద్యావ్యవస్థ పట్ల టీచర్లకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రేటర్లో 100 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 51 నందిహిల్స్కాలనీ సైలెంట్‌వ్యాలీలో రూ.30.30 కోట్లతో చేపట్టిన స్టీల్‌బ్రిడ్జిని ప్రారంభించారు. రూ.15.07 కోట్లతో పాత ముంబై హైవే నుంచి మల్కంచెరువు, చిత్రపురికాలనీ మీదుగా ఖాజాగూడ రోడ్డు వరకు చేపట్టిన లింక్‌రోడ్డును ప్రారంభించారు. సీఎస్సార్ కింద అపర్ణ కంపెనీ రూ.30 కోట్లతో అభివృద్ధి చేసిన మల్కంచెరువును సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. ఖాజాగూడ చెరువు నుంచి ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్‌వాల్ వరకు ఓఆర్ఆర్కు సమాంతరంగా రూ.47.66 కోట్లతో చేపట్టిన లింక్‌రోడ్డును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.
పిల్లలకు ఇష్టమైన కోర్సులు చదివించాలి
పాలు, బియ్యం, ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో తెలియని పిల్లలు చాలామంది ఉన్నారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నప్పటి నుంచే డాక్టర్లు, ఇంజినీర్లు చెయాలన్న ఆలోచనతో మూసధోరణిలో వారిని పెంచడమే కారణమని పేర్కొన్నారు. పిల్లల్లో సహజంగా ఉండే తెలివికి పదును పెట్టాలని, వారికి ఇష్టమైన కోర్సులను చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. జపాన్ పిల్లల మాదిరిగా మన పిల్లలను పెంచాలని, వారిలోని సృజనాత్మకశక్తిని అభినందించాలని సూచించారు. ఇన్నోవేషన్‌కు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, గ్రామీణ, సామాజిక ఇన్నోవేటర్లు ముందుకు రావాలని కోరారు. ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటుచేస్తున్నామని, ఇండస్ట్రీని, సైంటిఫిక్ ల్యాబ్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు రిచ్ అనే సంస్థను ఏర్పాటుచేశామని వివరించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ చాలెంజ్ నిర్వహించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. ప్రతి పాఠశాలలో సైన్స్‌ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు.