గన్‌తో కాల్చి చంపిన దుండగులు
మేడ్చల్, జూన్ 6(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లినపుడు దుండగులు అతనిని గన్‌తో కాల్చిచంపారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉంటున్న కూచ శ్రీనివాస్‌గౌడ్, నీలిమ దంపతులకు కొడుకు అన్షుల్ (28), కూతురు తన్వి ఉన్నారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసిన అన్షుల్ మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. ఫిలడెల్ఫియా పోలీసుల సమాచారం ప్రకారం.. నార్త్ ఫిలడెల్ఫియాలోని రేమండ్ రోసేస్ హోమ్స్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత కాల్పుల శబ్దాలు వచ్చాయన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. కాంప్లెక్స్ ఆవరణలో తలకు బుల్లెట్ గాయంతో స్పృహ లేకుండా ఉన్న అన్షుల్ కనిపించాడు. వెంటనే టెంపుల్ యూనివర్సిటీ దవాఖానకు తరలించినప్పటికీ, అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.
హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌కు పిజ్జా డెలివరీ చేయడానికి అన్షుల్ వెళ్లాడని, అయితే అది ఖాళీ ఇల్లు అని ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇన్స్పెక్టర్ స్కాట్ స్మాల్ తెలిపారు. బాధితుడి సమీపంలో మూడు బుల్లెట్ షెల్స్ దొరికాయి. దీనినిబట్టి నిందితుడు చాలా దగ్గరగా నిలబడి కాల్పులు జరిపినట్టు డిటెక్టివ్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఫిలడెల్ఫియా హౌసింగ్ అథారిటీకి చెందిన నిఘా కెమెరాల్లో పిజ్జా బాక్సులతో నడుచుకొంటూ వెళ్తున్న అన్షుల్‌ను నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెంబడించడం కనిపించింది. కాల్పులు జరిగిన అసలు దృశ్యాలు కెమెరాలో రికార్డు కాకపోయినప్పటికీ ఈ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అన్షుల్ పనిచేస్తున్న ‘పీట్స్ పిజ్జా’ నుంచే ఈ ఆర్డర్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు శనివారం తెల్లవారున సమాచారం అందడంతో విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని సాధ్యమైనంత తర్వగా ఇంటికి పంపించాలని అన్షుల్ సోదరి తన్వి కోరారు.