డిచ్పల్లి, ఆగస్టు 17: రెండు రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు ఉద్యోగం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది. మిట్టాపల్లికి చెందిన మాసిపెద్ది ప్రశాంత్ (29) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. తల్లిదండ్రులు బోధన్ ప్రాంతానికి చెందిన అమ్మాయితో ప్రశాంత్‌కు పెండ్లి నిశ్చయించారు. ఈ నెల 18న పెండ్లి జరగాల్సి ఉంది. ఈ నెల 15న ప్రశాంత్ మండల కేంద్ర శివారులోని గాయత్రీ ఎన్క్లేవ్ వద్దకు చేరుకొని స్నేహితుడికి ఫోన్ చేశాడు. బీటెక్ పూర్తయినా ఇప్పటికీ ఉద్యోగం రాలేదని, పెండ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎలా పోషించాలని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.
స్నేహితుడు వారించేలోగా ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పురుగుమందు తాగాడు. స్నేహితుడు వెంటనే విషయాన్ని ప్రశాంత్ కుటుంబసభ్యులకు తెలిపాడు. పోలీసులు.. చివరి కాల్ లోకేషన్‌ను ట్రేస్ చేసి గాయత్రీ ఎన్క్లేవ్ వద్దకు చేరుకోగా ప్రశాంత్ అపస్మారక స్థితిలో కనిపించాడు. కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శనివారం డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దవాఖాన నిర్వాహకులు యువకుడి మృతిపై సమాచారం ఇవ్వకపోవడం నేరమని, కేసు దర్యాప్తు చేసి దవాఖాన నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేశ్ తెలిపారు.