షాబాద్/మొయినాబాద్, ఫిబ్రవరి 4: భూతగాదాల్లో ఓ యువ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ హత్యకు పూనుకున్న ఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన వెంకటమ్మకు ఇద్దరు కూతుర్లు సరస్వతి, స్వప్న, ఒ క కుమారుడు రాజు ఉన్నారు. వీరికి పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో ఆరు ఎకరాలు కొడుకు రాజుకు, మిగతా నాలుగు ఎకరాల భూమి స్వప్నకు ఇస్తున్నట్టు అప్పట్లో గ్రామస్తుల సమక్షంలో తీర్మానించారు. భూమి పంపకంలో చెల్లికి ఎక్కువ భూమి ఇచ్చారని, గత కొన్నేండ్లుగా వివాదం కొనసాగుతున్నది.
వెంకటమ్మ పెద్ద కూతురు సరస్వతి వివాహం కాగా, చిన్న కూతురు స్వప్నకు నెల రోజుల్లో పెండ్లి కానున్నది. బుధవారం ఉదయం కేతిరెడ్డిపల్లిలో ఉన్న స్వప్న భూమిని సర్వే చేసేందుకు తల్లి వెంకటమ్మతో కలిసి వెళ్లింది. అక్కడ రాజు మరో వ్యక్తితో కలిసి చెలి స్వప్న (34) తలపై రాయితో గాయపరిచి, కత్తితో గొంతు కోసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో మొయినాబాద్‌లోని దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. స్వప్న నాలుగేండ్లుగా చేవెళ్ల కోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టిస్ చే స్తున్నారు. ఆమెపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయవాది స్వప్న హత్య విషయమై ఫిర్యాదు చేయడానికి చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మీకేం సంబంధం అంటూ పోలీసులు వారిని బయటికి పంపించడంతో న్యాయవాదులు అక్కడే జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. డీసీపీ యోగేశ్‌గౌతమ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.