వెంగళరావునగర్, అక్టోబర్ 18 : నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది యువతిపై బ్లేడ్‌తో దాడికి పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ శ్రీకాళహస్తి సమీపంలోని చోడవరానికి చెందిన మధుసూదన్ రెడ్డి(22), అదే ప్రాంతానికి చెందిన యువతి(21) నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో ఇటీవల ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. అనంతరం నగరానికి వచ్చిన ఇద్దరూ.. అమీర్‌పేటలోని ఓ సంస్థలో ఐటీ కోర్సులో శిక్షణ తీసుకుంటూ ఎస్ఆర్ నగర్‌లోని వేర్వేరు హాస్టళ్లలో ఉంటున్నారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసకావడంతో మధుసూదన్‌రెడ్డిని యువతి దూరం పెడుతుంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న మధుసూదన్ ఒక్కసారి మాట్లాడుతానంటూ హాస్టల్ నుంచి బయటికి పిలిపించి గొడవపడ్డాడు. తన వద్ద ఉన్న బ్లేడ్‌తో యువతి గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. యువతి అరవడంతో పెట్రోలింగ్ పోలీసులు కాపాడి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.