ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఊరు.. కూరగాయల క్షేత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిమ్మాపూర్‌లో రైతులు తీరొక్క పంటను పండిస్తూ రోజూ ఆదాయాన్ని పొందుతున్నరు. కొందామంటే కూరగాయలు దొరకని పరిస్థితి నుంచి హైదరాబాద్‌కు ఎగుమతి చేసే స్థాయికి చేరిందీ ఊరు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పుష్కలంగా నీళ్లుంటే వరి వేసేద్దాం అనుకొనే రోజులివి. కూరగాయలు పండించటం పెద్ద పని ఆలోచించే పరిస్థితులివి. అలాంటిది బోర్లు, బావుల నిండా నీళ్లున్నా, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు అందుతున్నా.. వరిని కాదని పండ్లు, కూరగాయల సాగుచేస్తున్నారు తిమ్మాపూర్ రైతులు. ఒకప్పుడు వరి పంటపై ఆధారపడి జీవించిన కుటుంబాలే అవి. వేలల్లో ఖర్చు, భరోసా లేని రాబడి ఉన్న వరి సాగుతో విసిగి వేసారి క్రమంగా కూరగాయల బాట పట్టాయి. 300 కుటుంబాలు ఉన్న ఆ ఊరిలో అందరికీ కూరగాయల సాగే ప్రధాన వృత్తి. ఇక్కడి రైతులు 529 ఎకరాల్లోనే వరిని సాగు చేస్తుండగా, 551 ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఇందులో పండ్లతోటలు 350 ఎకరాల వరకు ఉన్నాయి. మిగతా 200 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. గ్రామంలో ఉన్నది ఎకరం, రెండు, మూడెకరాలున్న సన్న, చిన్నకారు రైతులే. వీరంతా తిండిగింజల కోసం అరెకరం, ఎకరంలోనే వరిని సాగు చేస్తూ, మిగతా భూమిలో కూరగాయల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాట, బెండ, కాకర, గోకర, బీర, పొట్లకాయ, బీన్స్, చిక్కుడు, వంకాయ, మిర్చి, దొండ వంటి కూరగాయలను ఒక్కో సీజన్లో ఒక్కో రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకంగా కల్పించిన పందిరి సాగు సైతం ఇక్కడి రైతులకు తోడ్పాటునందిస్తున్నది.
నిత్యం 3 టన్నుల కూరగాయల ఎగుమతి
ఈ పల్లె అర్ధరాత్రే నిద్ర లేస్తుంది. అంతకు ముందురోజు తోటల్లో కోసుకొచ్చిన కూరగాయలను అమ్మేందుకు ఆటోల్లోకి ఎక్కించే సందర్భంలో ఊరంతా సందడిగా ఉంటుంది. తిమ్మాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లోని అల్వాల్ రైతు బజార్‌కు ఇక్కడి కూరగాయలను తరలించేందుకు నాలుగు ఆటోలు సిద్ధంగా ఉంటాయి. నిత్యం 3 టన్నుల వరకు కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. కూరగాయల విక్రయం ద్వారా ఒక్కో రైతు అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేసే పిల్లలున్నా ఆయా కుటుంబాలు కూరగాయలే పండిస్తాయి.
వరి వేసుడు దండుగ
వరికి నీళ్లెక్కువ. నాట్లు వేయాలన్నా, కోతలకైనా కూలీలు కావాలి. చీడపీడలూ ఎక్కువే. ఆరు నెలల తర్వాత గానీ పంట చేతికొస్తుందన్న నమ్మకం ఉండదు. పోయినసారి ఎకరంలో వరి వేస్తే.. పది సంచుల వడ్లు కూడా రాలె. అందుకే ఈసారి దొండ సాగుచేస్తున్న. వారానికి 2 క్వింటాళ్ల దిగుబడి వస్తది.
ఏరోజుకారోజు సంపాదన
కూరగాయలతో ఏ రోజుకారోజు ఆదాయం ఉంటది. ఎకరం ఇరవై గుంటల్లో కూరగాయలను సాగు చేస్తున్నం. అర ఎకరంలో చిక్కుడు వేసినం. ఖర్చులుపోను ఏడాదికి లక్ష ఆదాయం వస్తదన్న నమ్మకం ఉన్నది.
నిత్యం రాబడే
కూరగాయల సాగుతో ప్రతి రోజు రాబడి వస్తున్నది. మంచి ధర ఉన్నపుడు లాభం ఎక్కువగా వస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కూరగాయల సాగుతో లాభం రాకున్నా. నష్టం మాత్రం రాదు. పెట్టుబడి కూడా తక్కువ. వరి సాగుకు ఎకరాకు ప్రతి రోజూ 60వేల లీటర్ల నీళ్లు అవసరమైతే కూరగాయల సాగుకు 32 వేల లీటర్లు చాలు. ఎకరా వరి సాగుకు విద్యుత్తు ఖర్చు పంట కాలానికి రూ.5 వేలకు పైగా వస్తే, కూరగాయల సాగుకు రూ.2,500 దాటదు.