మెహిదీపట్నం, జూన్ 14: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలోనే యువకుడిని హత్య చేసినట్టు ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిరుడు ఆగస్టు 27న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముజాహిద్‌ను, అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖుద్దూస్(27) మరికొందరితో కలిసి హత్య చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ముజాహిద్ సోదరులు గురువారం అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్ క్రాస్‌రోడ్ సమీపంలో ఖుద్దూస్ వెంటపడి వేటాడారు. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ఖుద్దూస్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నిందితులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన ఖుద్దూస్‌ను ఉస్మానియా దవాఖానకు చికిత్సకోసం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఖుద్దూస్ మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.