పోస్టల్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన కాల్ లెటర్‌ను ఆలస్యంగా అందించడంతో కోర్టులో జాబ్ పొందే అవకాశాన్ని కోల్పోయాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ శివారు సపావట్ తండాకు చెందిన జాటోత్ సంతోశ్ కుమార్ ఏపీలోని కర్నూలు జిల్లా కోర్టులో కంప్యూటర్ ఆపరేటర్, స్టెనో పోస్టులకు తాను దరఖాస్తు చేసుకున్నాడు. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ నెల 16వ తేదీన ఇంటర్వ్యూకి హాజరుకావాలని రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కాల్ లెటర్‌ను కర్నూలు జిల్లా కోర్టు పంపించింది. అయితే ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను డెలివరీ చేయడంలో పోస్టల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. తాపీగా ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం కాల్ లెటర్‌ను అందించారు. ఇది చూసుకున్న సంతోశ్‌కుమార్ షాకయ్యాడు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇంటర్వ్యూ తేదీ ముగిసిన తర్వాత కాల్ లెటర్‌ను అందించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై వరంగల్ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను ఆలస్యంగా అందించి ఉద్యోగం రాకపోవడానికి కారణమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.