హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓహియోకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన కుదురుమల్ల అరుణ్‌కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. ప్రపంచ ఏవియేషన్ చరిత్రకు పునాది వేసిన రైట్ బ్రదర్స్ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఓహియో బర్త్ ప్లేస్ ఆఫ్ ఏవియేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
అలాంటి సంస్థలో తెలంగాణ యువకుడు డైరెక్టర్‌గా ఎన్నికవడం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అరుణ్‌కుమార్ రెడ్డి వికారాబాద్ జిల్లా దోమ మండలకేంద్రానికి చెందినవారు. చిన్ననాటి నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తితో ఏవియేషన్ రంగాన్ని ఎంచుకుని విజయం సాధించారు. ఇండియాలో ఏవియేషన్ విద్యను పూర్తిచేసి అమెరికాలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ప్రస్తుతం ప్రముఖ విస్టా అమెరికాలో మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
విమానాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, ఆపరేషనల్ సమస్యలను ముందుగానే గుర్తించడం, ఆధునిక అభివృద్ధి విధానాలను రూపొందించడంలో అరుణ్‌కుమార్‌రెడ్డి సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రస్తుతం అమెరికాలో ఏవియేషన్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరడం తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.