చొప్పదండి, నవంబర్15 : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్ష పడుతుందని మనోవేదనతో కరీంనగర్ జిల్లా చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్(28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 1న చొప్పదండి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో విజయ్ పట్టుబడగా, కేసు నమోదైంది. 14న శుక్రవారం విజయ్‌ని పోలీసులు కరీంనగర్ కోర్టుకు పంపించారు. మేజిస్ట్రేట్ రానందున కేసు వాయిదా వేశారు. శనివారం ఉదయం విజయ్ ఇంటి నుంచి కోర్టుకు వెళ్లగా ఆరోజు కూడా మేజిస్ట్రేట్ రాలేదు. దీంతో విజయ్ ఇంటికి వచ్చి బెడ్రూంలో పడుకుంటానని భార్య ప్రియాంకకు చెప్పి వెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత బెడ్రూం నుంచి శబ్దం రావడంతో భార్య చూసింది. అప్పటికే విజయ్ ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో శిక్ష పడతుందని మనోవేదన, భయంతో ఉరి వేసుకున్నట్టు మృతుడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.