తాంసి, మార్చి 14: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువరైతు మల్లెల అక్షయ్ (29) విద్యుత్తు షాక్‌తో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లెల దివాకర్-రుక్మాబాయి దంపతులు తమకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అక్షయ్‌కి 18 నెలల క్రితమే పెండ్లయింది. పది రోజుల క్రితమే కూతురు కూడా పుట్టింది. కాగా.. అక్షయ్ వ్యవసాయంతోపాటు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో మక్క చేనును అడవి పందుల బెడద నుంచి కాపాడుకోవడానికి విద్యుత్తు తీగలు అమర్చాడు. గురువారం ఉదయం చేనులో తన తండ్రి దివాకర్‌తో పనిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు అమర్చిన కరెంటు తీగలు తగిలాయి. దీంతో అక్షయ్ విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివరాం తెలిపారు.