హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): వాసవి అర్బన్ ప్రాజెక్టులో ఫ్లాట్లు చేతికిరావాలంటే కొనుగోలుదారులు మరో ఏడాదిపాటు ఆగాల్సిందేనని వాసవీ గ్రూప్ నిర్మాణ సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఆగస్టు 3 వరకు ఫ్లాట్ల హ్యాండోవర్ వీలుకాదని స్పష్టంచేసింది. అప్పటివరకు ఎన్ని గొడవలు చేసినా, ఎంత రాద్ధాంతం చేసినా ప్రాజెక్టు నిర్మాణాన్ని చెప్పిన గడువులోగా పూర్తి చేయలేమని, నిర్మాణంలో ఉన్న బ్లాకులు పూర్తైన తర్వాతే.. కొనుగోలుదారులకు ఫ్లాట్లు అందజేస్తామని పేర్కొన్నది. ఫ్లాట్ల నిర్మాణ జాప్యానికి రెరా అనుమతులు కూడా కారణమని, రెరా ఇచ్చిన గడువు ప్రకారం ఫ్లాట్లను అందజేయడం సాధ్యం కాదని పేర్కొన్నది. బాచుపల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలుచేసిన వందలాది మందికి, ఏండ్లు గడుస్తున్నా ఫ్లాట్లు అప్పగించడంలో ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. దీంతో తాము పడుతున్న ఇబ్బందులపై కంపెనీని నిలదీసినా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, ఫ్లాట్లను అప్పగించకుండా వేధిస్తున్నదంటూ కొనుగోలుదారులు రోడ్డెక్కారు.
రెండేండ్ల తర్వాత ఓసీ ఇస్తాం
తమకు ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం కారణంగా తమపై అధిక వడ్డీల భారం, అద్దెల భారం పడుతున్నదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కానీ, వాసవీ గ్రూప్ మాత్రం ఎంత రాద్ధాంతం చేసినా ఫ్లాట్లకు ఓసీ మాత్రం 2028 ఫిబ్రవరి వరకు ఇచ్చేది లేదని చెప్తున్నది. తాజాగా బ్లాకుల వారీగా హ్యాండోవర్, ఓసీలను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి, ఫిబ్రవరి 2028 వరకు దశల వారీగా అందజేస్తామని పేర్కొన్నది. బ్లాక్-8లో కస్టమర్లు ప్రాజెక్టు స్థలంలో నిరసనలకు దిగడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టు రెరా ఆమోదించిన గడువులు, చట్టబద్ధమైన పొడిగింపుల పరిధిలోనే కొనసాగుతున్న సమయంలో, నిరసనలు చట్టపరమైన ఆధారం లేనివని పేర్కొన్నది. ఇటువంటి చర్యలతో వాటాదారులకు, నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. బ్లాక్-8లో న్యాయపరమైన ఇబ్బందులు ఇంకా ఉన్నాయని, పరిష్కారమయ్యే వరకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిహారం కల్పిస్తామని తెలిపింది. అదనపు ఆర్థికభారం లేకుండానే ఇతర బ్లాక్‌లకు మారాలని సూచించింది. లక్షల రూపాయలు వెచ్చించిన తమకు ఫ్లాట్లు సకాలంలో అందించకుండా, న్యాయపరమైన ఇబ్బందులను బూచిగా చూపెట్టి హ్యోండోవర్ తేదీలను ఏండ్లకు ఏండ్లు పొడిగించడంపై కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.