Spot Admissions | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): మీరు ఎప్‌సెట్‌లో క్వాలిఫై అయి, ఇప్పటివరకూ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరలేదా? ఎప్‌సెట్ ప్రవేశపరీక్షలో క్వాలిఫై కాలేదా? మీలాంటి వారికీ బీటెక్‌లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లో అవకాశం కల్పిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో ఖాళీ, మిగులు సీట్లను భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఎప్‌సెట్ క్వాలిఫై అయిన వారే కాకుండా, క్వాలిఫై కానివారు సైతం ఈ సీట్లకు పోటీపడవచ్చు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు స్పాట్ అడ్మిషన్లను కల్పిస్తారు. ఈ సీట్లలో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. మొత్తం ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. మొదట వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో 34 సీట్లు ఖాళీగా ఉండగా, వీటిని స్పాట్ కోటాలో భర్తీచేయనున్నారు.
జేఎన్టీయూ, కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు కలుపుకొంటే 1,623 సీట్లను ఈ స్పాట్ సెలక్షన్ ద్వారా భర్తీ చేస్తారు. కూకట్పల్లి, సుల్తాన్పూర్ కాలేజీల్లో ఈ నెల 30న జగిత్యాల, మంథని కాలేజీల్లో ఆగస్టు 31న వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సెప్టెంబర్ 2న స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీట్లను భర్తీచేస్తారు.
ప్రైవేట్ కాలేజీల్లో 10,213 మిగులు సీట్లను సైతం స్పాట్ అడ్మిషన్స్ కోటాలో భర్తీచేస్తారు. స్పాట్ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ఎప్‌సెట్ ర్యాంకు కార్డు (క్వాలిఫై అయితే), కుల, నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.