హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): యోగా డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా’ కార్యక్రమ నిర్వహణపై తెలంగాణ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయుష్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయుష్ శాఖకు చెందిన యోగా శిక్షకులు, మెడికోలు, వివిధ పాఠశాలలకు చెందిన 5500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.