హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్ సాగు 50 లక్షల ఎకరాలకు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా వరి 36.21 లక్షల ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది. ఆ తర్వాత 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.5 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. గత ఏడాది ఈ సమయం వరకు మొత్తం పంటల సాగు 37.85 లక్షల ఎకరాలు. గత ఏడాదితో పోల్చితే సుమారు 12 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు కావడం గమనార్హం. వరి సాగు కూడా గతంతో పోల్చితే 9.5 లక్షల ఎకరాల్లో అధికంగా సాగైంది.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించింది. దరఖాస్తుకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఇందులో మొత్తం 20 పరికరాలను వ్యవసాయ శాఖ పంపిణీ చేయనుంది. ముఖ్యంగా 600 ట్రాక్టర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు 12వేల రోటవేటర్స్, 12వేల స్ప్రేయర్స్, 160 డ్రోన్లు, 4వేల కల్టివేటర్స్, 600 సీడ్ డ్రిల్స్, 6వేల కేజ్వీల్స్తో పాటు ఇతర పరికరాలను పంపిణీ చేయనుంది.