హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.100 కోట్లు ఆర్జించే అన్ని ఆలయాలకు ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు, ఇతర దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల, ధర్మాదాయముల సవరణ బిల్లు-2025’ను ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాట్లాడారు. ఈ సవరణ బిల్లు ద్వారా వైటీడీ బోర్డులో 18 మంది సభ్యులు, ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ఆదా యం ఏటా రూ.224 కోట్లు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీ తరహాలోనే వైటీడీని కూడా ఇతర రాష్ర్టాల్లో విస్తరించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
వైటీడీలో ఉండే 18 మంది సభ్యులకు ఎలాంటి జీతభ్యతాలు ఉం డవని, బదులుగా టీఏ, డీఏ బోర్డు కల్పిస్తుందని చెప్పారు. వైటీడీ పరిధిలో భిక్షాటన, పశువధ, మాంసాహారం, మద్యపానం నిషేధిస్తున్నట్లు తెలిపారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించామని వెల్లడించారు. గోశాలలకు, విద్యా సంస్థలకు ఏటా బోర్డు నుంచి నిధులు వెచ్చించేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12,434 దేవాలయాలను సవరణ బిల్లులో నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. ఏటా రూ.2లక్షల నుంచి రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చే దేవాలయాలు ఈ క్యాటగిరిల్లో ఉన్నట్లు మం త్రి సురేఖ తెలిపారు. రానున్న రోజుల్లో వేములవాడ, భద్రాచలం, బాసర, కొమరవెల్లి, కొండగట్టు ఆలయాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. అన్ని దేవాయాల పాలకమండలి పదవీ కాలం ఏడాది నుంచి రెండేండ్లకు పెంచుతున్నామని వెల్లడించారు.