కొండాపూర్, జూన్ 26: బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో కోట్ల విలువ చేసే స్థలంలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ యాదవ భవన్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్రస్థాయి సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని ఓ ప్రైవేట్ హోటల్లో అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకృష్ణ యాదవ భవన్ ట్రస్ట్ చైర్మన్ చింతల రవీంద్రనాథ్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. కోకాపేటలో యాదవ భవన్ నిర్మాణం పూర్తయి రెండేండ్లు దాటుతున్నదని, తక్షణమే దానిని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. యాదవుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలోనే యాదవ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. సమావేశంలో రాష్ట్ర పోలీస్ కైంప్లెంట్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, వివిధ యాదవ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.