హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): యాదాద్రి.. కృష్ణశిలలతో నిర్మాణమైన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం. యాదగిరిగుట్టపై అడుగుపెట్టింది మొదలు.. స్వామివారిని దర్శించుకునేవరకు అణువణువూ ఆధ్యాత్మికతను నింపుతున్నది. కొండ పైనున్న సప్తగోపురాలు స్వర్గలోక వైకుంఠాన్ని చూసిన ఆనందాన్ని కలిగిస్తాయి. ఆలయగోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణి, యాగశాల.. ఇలా దేనిని చూసినా అడుగడుగునా ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడుతుంది. పునర్నిర్మాణానికి ముందు ఉన్న ఆలయానికి ఏమాత్రం తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే అంతకుమించి అనేలా రూపుదిద్దుకున్నదని సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది. యాదాద్రి పునర్నిర్మాణాన్ని మాజీ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో అబ్బురపడే రీతిలో పునర్నిర్మాణం పూర్తిచేశారు. నరసింహుడి సన్నిధిని ఎక్కడా రాజీపడకుండా, పక్కా ప్రణాళికతో దీక్షగా తీర్చిదిద్దారు. పూర్తిగా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి అన్ని నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ అత్యంత పకడ్బందీగా నిర్మించారు.
వందశాతం శిలలు.. ఎన్నో నిర్మాణ శైలులు
యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణశైలులను వినియోగించారు. వందశాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని పునర్నిర్మించడం యాదాద్రిలోనే సాధ్యమైంది. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఈ కృష్ణశిలను గురుజపల్లిలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సంస్థ, వాటితో చెక్కిన శిలల నాణ్యతను మెస్సెరస్ సివిల్స్ ఇంజినీర్స్ సంస్థలు పరిశీలించి ధ్రువీకరించాయి. ఈ కృష్ణశిల ఏండ్లు గడిచేకొద్దీ మరింత నునుపుదేలి నాణ్యతను సంతరించుకుంటుంది. ఆలయనిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు జరగడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
నల్లరాతి శిలలను 1,200మంది శిల్పులు రేయింబవళ్లు శ్రమించి అద్భుత కళాఖండాలుగా మలిచారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండేవిధంగా రూపకల్పన చేశారు. ఆధ్యాత్మికతను పంచుతూ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. వాస్తవానికి 17వ శతాబ్దం తర్వాత రాతినిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంట్ వాడకం పెరిగింది. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగునేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఆ తర్వాత మళ్లీ పూర్తి రాతి నిర్మాణంతో రూపొందిన ఆలయం యాదాద్రే అని చరిత్రకారులు చెప్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం కోసం మొత్తం 9.5 లక్షల క్యూబిక్ మీటర్ల కృష్ణశిలను వినియోగించారు. వీటి బరువు దాదాపు రెండున్నర లక్షల టన్నులు. వెయ్యేండ్లపాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.

వైటీడీఏకు పూర్తి అధికారాలు
ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున కేసీఆర్ స్వయంగా ప్రతి పనినీ పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి వైటీడీఏను(యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేసి దాని ద్వారానే ఆలయనిర్మాణం చేపట్టారు. స్థల సేకరణ, ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన అన్ని అంశాల్లో వైటీడీఏనే కీలకంగా వ్యవహరించేది. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు కూడా వైటీడీఏ నుంచే జరిగేలా చూశారు. పాంచరాత్ర ఆగమ ప్రకారం ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి తేడా రాకుండా చూశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ 2,400 డ్రాయింగ్లను పరిశీలించి ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. ప్రతీసారి సమావేశాలు పెట్టడం, సమీక్షల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం, పూర్తిగా వైటీడీఏ ద్వారానే చేపట్టారు. కేసీఆర్‌తోపాటు అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఆలయ నిర్మాణంపై ఆరా తీసేవారు. నిర్మాణం జరిగిన కాలంలో సీఎం, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సునీత ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించేవారు.
ప్రణాళికాబద్ధంగా పనులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తి ప్రణాళికబద్ధంగా సాగింది. మొదట బాలాలయ నిర్మాణం చేపట్టారు. స్వామివారి కైంకర్యాలకు లోటురాకుండా భక్తులు తాము యాదగిరిగుట్ట నరసింహస్వామినే దర్శించుకుంటున్న భావన కలిగేట్టు ఏర్పాట్లు చేశారు. బాలాలయంలో ఉత్సవాలు, ఇతర అన్నిసేవలకు అవకాశం కల్పించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూశారు. పాత ఆలయంలోనూ స్వామివారికి నిత్యపూజ కైంకర్యాలు నిర్వహిస్తూనే ఆలయ గర్భాలయంలో, బాలాలయంలో జరిగే సంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో ఎలాంటి మార్పు రాకుండా జాగ్రత్తపడ్డారు.
పూర్తిగా ప్రభుత్వ నిధులే
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులకు నిధులన్నింటినీ వైటీడీఏ ద్వారా ప్రభుత్వమే భరించింది. ఎక్కడా ఆలయ నిధులు వాడుకోలేదు. మొదటినుంచీ అవసరమైన నిధులను సమయానికి మంజూరుచేసింది. ఆలయానికి సంబంధించిన వెండి, బంగారం అస్సలు ముట్టుకోలేదు. నిర్మాణపనుల సమయంలో వాటి ప్రసక్తే రాలేదు. అవి ఎప్పటికీ పదిలంగానే ఉంటాయని దేవాదాయశాఖ అధికారులు ముందే ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అయినట్టు అంచనా. ఈ నిధుల్లో అత్యధికంగా ఆలయ విస్తరణకు సంబంధించి రెండువేల ఎకరాల భూమిని సేకరించడానికే వెచ్చించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చయినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా పునర్నిర్మాణం తర్వాత నారసింహుడి గుడి మాత్రమే కాదు, ఏకంగా యాదగిరిగుట్టే మారిపోయింది. ఆధ్యాత్మికశోభను పంచుతున్నది.ఆలయంలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే యాదాద్రి ఆలయంలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. సాధారణంగా దేవాలయాల్లో గాలిగోపురాల బరువు ఎక్కువ కాకుండా ఉండేందుకు ద్వారబంధం పైనుంచి ఇటుకలతో నిర్మాణాలు చేస్తుంటారు. కానీ, యాదాద్రి నారసింహుడి ఆలయగోపురాల నిర్మాణంలో చివరి అంచు వరకూ రాయినే వాడారు. ఒక్క మహారాజగోపురానికే 13వేల టన్నుల రాయిని వాడారంటే అర్థం చేసుకోవచ్చు.
శిలలను అతికించేందుకు సంప్రదాయ పద్ధతిలో బెల్లం, జనపనార, కరక్కాయ, కలబంద, సున్నం, నీటి మిశ్రమాన్ని వాడారు. రాళ్లమధ్య పెద్ద అంతరాలను తొలగించడానికి సీసాన్ని వినియోగించారు. సిమెంట్ మచ్చుకైనా వాడలేదు. గతంలో యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉండేది. దీనికి మరో గుట్టను జోడించి మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా సహజసిద్ధంగా ఉండేలా మట్టితో నింపి మూడెకరాలకు విస్తరించారు. కొండ కోసం తరలించిన మట్టి రాళ్లు కూలిపోకుండా పటిష్టంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్టతను, నాణ్యతను జేఎన్టీయూ, నిట్ నిపుణులు పరీక్షించారు. చలికాలం, ఎండాకాలంలోనే కాకుండా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందో చెక్ చేశారు. భారీ వర్షాలు పడినా కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా సమస్యలు తలెత్తలేదు.