యాదగిరిగుట్ట: మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున కొండకింద గాలిగోపురం వద్ద ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భక్తులు శ్రీవారి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. అనంతరం ఉచిత దర్శనం క్యూలైన్లో ప్రధాన ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శంచుకున్నారు. దీంతో రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది.
స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంప్రదాయం ఏండ్లుగా కొనసాగుతున్నది. అయితే 2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గిరిప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా స్వామివారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

