యాదాద్రి, జూలై 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా కన్పించింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.26,07,800 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.