21న స్వస్తివాచనం.. 22న యాగశాల ప్రవేశం
11 కోట్ల లక్ష్మీనృసింహ మూలమంత్ర జపం
21 నుంచి 28 వరకు అదివాస కార్యక్రమాలు
ప్రపంచ శాంతికి పంచకుండాత్మక మహాయాగం
దివ్య విమానానికి మహాసుదర్శన ఆవాహనం
‘నమస్తే తెలంగాణ’తో యాదాద్రి ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు
21న సంప్రోక్షణ స్నపన, మృత్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభమై, 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునఃప్రారంభం కానున్నది. – యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన
యాదాద్రి, మార్చి 16: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్తకోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం చేసుకోగా, ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు మహాకుంభ సం ప్రోక్షణ జరుగనున్నదని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పంచకుండాత్మక మహాయాగంతో సంప్రోక్షణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 21న సంప్రోక్షణ స్నపన, మృ త్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభించి, 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునఃప్రారంభం కానున్నదని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ నెల 21న ఉదయం స్వామివారికి ఉత్సవాంగ, ప్రతిష్ఠాంగ సం ప్రోక్షణంగా స్నపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి స్వస్తివాచనం అత్యంత వైభవోపేతంగా చేపడతారు. సాయంత్రం మృత్సంగ్రహణ, అంకురారోపణ జరుగుతాయి. 22న ఉదయం అగ్నిమథనం, యాగశాల ప్రవేశం, సమస్త వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, మాన, ఉన్మాన, ఉపమాన, లంభమానాది దోషాలు తొలగిపోవడానికి మహావాస్తు శాంతిపూజ నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
యాగశాలలో మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలు
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపా లు జరుగుతాయి. వైదృశ్యంగా హవన విధివిధానాలు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేకమైన హోమాలు నిర్వహిస్తా రు. స్వామివారికి మహామంత్ర బలం సమకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్వామివారికి మూలమంత్రం, మూర్తి మంత్రం, మహాలక్ష్మీ మంత్రం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మంత్రం, ధ్వజస్తంభానికి గరుడ మహామంత్రం వంటి జపాలు నిర్వహిస్తాం.
11 కోట్ల లక్ష్మీనృసింహ మూల మంత్ర జపం
యాదాద్రీశుడికి 11 కోట్ల లక్ష్మీనృసింహ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలను నిర్వహించాలని సంకల్పించాం. నెలకు ఒక కోటి జపం పఠించేందుకు ఒక ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. ఈ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలన్నీ మూడున్నర సంవత్సరాల నుంచే ప్రారంభించాం. ఇప్పటి వరకు 8 కోట్ల జపం పూర్తయింది. సంకల్పానికి వికల్పం లేకుండా 108 మంది రుత్విక్కులతో జపం చేయిస్తున్నాం. దీనివల్ల యంత్రాలకు మహాబలం చేకూరుతుంది. ఈ యంత్ర బలంతోనే భక్తులకు స్వామివారు అభయ వరప్రదానం చేస్తారు.
ప్రతిరోజూ అదివాస కార్యక్రమాలు
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజూ అదివాస కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు ప్రతిష్ఠించే విగ్రహాలు, మూర్తులకు మొదటి రోజు మానోన్మాన పరీక్ష నిర్వహిస్తాం. మృత్రిక అదివాసం చేపడుతాం. నవ కలశ అభిషేకాలు నిర్వహిస్తాం. ఇందులో అభివృద్ధిగా ఒకరోజు 9 కలశాలతో, మరోసారి 16 కలశాలతో, మరో రోజు 25 కలశాలతో, ఆ మరుసటి రోజు 108 కలశాలతో, 81 కలశాలతో, వెయ్యి కలశాలతో అభిషేకాలు నిర్వహిస్తాం. ప్రతిష్ఠ చేయాల్సిన విగ్రహాలకు ఉత్తమ, మధ్యమ, అధమ, ఉత్తమోత్తమాది స్నపనాలు నిర్వహిస్తాం. ధాన్యాదివాసం, జలాదివాసం, సేయాదివాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్వామివారిని ఒకరోజు నీటిలో, ఒకరోజు పంచామృతాలలో, ఒక రోజు పూర్తిగా ధాన్యంలోనూ, మరోరోజు పుష్పాలు, ఫలాల్లో ఉంచుతాం. ఇంకో రోజు శోడసన్యాస తత్వాన్యాస మహాకలాణ్యాస హోమాలు జరుగుతాయి. పాంచరాత్రాగమశాస్త్రం, భగవద్ రామానూజ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకత్వంలో కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
వంద రెట్లు సమన్వితంగా ఉత్సవాలు
ఈ ఉత్సవాల్లో స్వామివారికి చేసే ప్రధానమైన కైంకర్యాలు ద్విగుణీకృతంగా, శతకృత అభివృద్ధిగా వంద రె ట్లు మంత్ర శక్తి సమన్వితంగా చేస్తాం. ఏ లోపాలు లేకుం డా, ఆర్భాటాలు, అట్టహాసాలకు పోకుండా, పరమ ఏకాంతిక విధివిధానంతో కార్యక్రమాలు జరుగుతాయి.
28న మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి స్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభంలో భాగంగా చివరి రోజైన 28వ తేదీన స్వామివారి దివ్య విమాన శిఖరానికి కుంభ సంప్రోక్షణాభిషేక మహాసంకల్పం చేయనున్నాం. ఉదయం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన యాదాద్రి దేవస్థానాన్ని భక్తులకు, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పునరంకితం చేస్తారు.
దివ్యవిమానానికి మహాసుదర్శన ఆవాహనం
యజ్ఞశాలలో ప్రధాన వేదికలో మహామూర్తి కుంభస్థాపన, సప్తగోపురాలకు ప్రత్యేక మహాకుంభాభిషేకానికి కుంభస్థాపనలు, ప్రధాన కుంభం బంగారు కలశంతో ఉంటాయి. ప్రధాన కుంభంలో లక్ష్మీనరసింహస్వామిని ఆవాహనం చేస్తాం. ఒక్కో కుంభంలో గాలి గోపురంలో ఉన్న దేవతలను ఆవాహనం చేస్తాం. దివ్య విమానానికి మహాసుదర్శన ఆవాహనం, సప్త రాజగోపురాలకు అధిష్టాన దేవతల ఆవాహనం చేస్తాం.
పంచకుండాత్మక మహాయాగం
స్వామివారి బాలాలయంలోని యాగశాలలో పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తాం.వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మహాలక్ష్మి యజ్ఞకుండాలతో స్వాహాకార యజ్ఞం నిర్వహిస్తాం. దీన్ని ఆగమ శాస్త్ర బిగి, జిగి, విధి, విధానంగా అభివర్ణిస్తారు. స్వామివారిని బిం బం, కుంభం, చక్రాబ్ది మండలం, అగ్ని యందు ఆవాహనం చేస్తూ చతుస్థానార్చన కార్యక్రమం చేపడుతాం. ఇది చాలా గొప్ప పూజ. ప్రపంచ దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని, ప్రస్తుతం నెలకొన్న రష్యా – ఉక్రెయిన్ శత్రుత్వాలు నశించి, ప్రజలంతా శాంతియుతంగా ఉండేందుకు ఈ యజ్ఞం కూడా మంత్రశక్తిని కల్పిస్తుంది.
సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపం
నరసింహస్వామివారిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న భక్తి మరోసారి నిరూపితమైనది. కేసీఆర్‌ను సీఎంగానే కాకుండా అభినవ ప్రహ్లాదుడిగా భావిస్తాం. ప్రహ్లాదతత్వం ఉంటేనే నరసింహస్వామి వశీకరమవుతాడు.