హైదరాబాద్, మార్చి21 (నమస్తే తెలంగాణ): లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డులో తమకు కచ్చితంగా స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, గౌరవాధ్యక్షుడు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. వైటీడీ బోర్డులో వైదిక ఆగమ శిల్పశాస్త్రంలో నిష్టాతులైన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. అరుదైన శిల్ప సంపద కలిగిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వైభవాన్ని చాటాలని, ముఖ్యమంత్రికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు.