YTPS | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): వివిధ రాష్ర్టాలు, సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగియనున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆశాదీపం కానున్నది. విద్యుత్తు రంగంలో స్వయంసమృద్ధిని సాధించేందుకు తలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ర్టాన్ని విద్యుత్తు కష్టాల నుంచి బయటపడేయనుంది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు ఇతర రాష్ట్రాల్లోని పవర్ ప్లాంట్లతో చేసుకున్న ఒప్పందాల గడువు సమీపిస్తున్నది. కీలక ఒప్పందాల గడువు రెండుమూడేండ్లలో నే ముగియనుంది.
2024-25లో 2,284 మెగావాట్లు, 2025 -26లో 2,400 మోగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగుస్తాయి. వీటితో పాటు మరో 2,899 మెగావాట్ల సోలార్ విద్యుత్తు వినియోగ ఒప్పందాలు సైతం ముగియనున్నాయి. రామగుండం యూనిట్ -7కు చెందిన 87.76 మెగావాట్ల ఒప్పందం 2026 -27లో ముగియనుంది. 2028-29లో 583.9 మెగావాట్ల సింహాద్రి ఒకటో దశ ఒప్పందం ముగియనుండగా, అదే ఏడాదిలో వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ ఒప్పందం గడు వు సైతం 2028-29లో ముగియనుంది.
రానున్న పదేండ్ల కాలంలో 4,684 మోగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల గడువు ముగియనుంది. సరిగ్గా విద్యుత్తు లోటు ఏర్పడే ఆ సమయంలోనే యాదాద్రి పవర్‌ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి నుంచి బయటపడేయనున్నది. కానీ ఇవేమి పట్టించుకోకుండా కొంతమంది యాద్రాద్రి పవర్ ప్లాంట్ అనవసరమంటూ అవాకులు చెవాకులు పేలుతున్నారు.
పవర్ పర్చే జ్ అగ్రిమెంట్లు ముగియనున్న నేపథ్యంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంటు ఆశాదీపం కానున్నది. 2025 -26 కల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్లలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానున్నది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో సింక్రనైజేషన్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే రోజుకు కొంత విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. మరో రెండు నెలల్లో ఈ ప్లాంట్ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్తు.. గ్రిడ్‌తో అనుసంధానం కానుంది. మిగతా మూడు యూనిట్లు సైతం వచ్చే ఏడాది కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి రాష్ట్రం కొత్తగా ఇతర రాష్ట్రాలతో పీపీఏలు చేసుకోవాల్సిన అవసరముండదు. అంటే మొత్తంగా విద్యుత్తు విషయంలో రాష్ట్రం స్వీయ సమృద్ధిని సాధించినట్టే.