దామరచర్ల, జూన్ 11: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్‌పరం చేసేందుకే మొగ్గుచూపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వైటీపీఎస్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. అలాంటి ప్లాంట్‌ను కుట్రలతో ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తొలి అడుగులు వేసింది. ముందుగా కొన్ని యూనిట్లను ప్రైవేట్‌పరం చేసి అనంతరం మిగతా ప్లాంట్‌ను ప్రైవేట్‌కు కట్టబెట్టే యోచనలో సర్కార్ ఉన్నది. ప్రస్తుతం రాష్ర్టానికి పెద్ద దిక్కు అయిన, దేశంలోనే అతి పెద్దదైన ఈ యాదాద్రి ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలనే సర్కార్ యోచన సరికాదంటూ స్థానికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఉద్యోగుల కొరతను సాకుగా చూపుతూ ప్లాంట్‌లోని స్టేజ్-1, స్టేజ్-2 యూనిట్లకు చెందిన కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులకు 3 సంవత్సరాలకు గాను టీజీ జెన్కో టెండర్లను పిలిచింది. ఎస్టిమేషన్ కాంట్రాక్టు విలువ రూ.250 కోట్లుగా టీజీ జెన్కో పేర్కొన్నది. టెండర్లు వేసేందుకు ఈ నెల 12 నుంచి 29 వరకు గడువు ఇచ్చింది. విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నాటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని చూడటం శోచనీయం.
ఇటీవల సింక్రనైజ్ చేసిన ఐదో యూనిట్లో అగ్నిప్రమాదం జరిగి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఆ యూనిట్ పనులు కూడా పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ర్టానికి ఈ ప్లాంటే ఆధారం. దేశంలోనే పెద్దదైన ఈ ప్లాంటును ప్రైవేట్‌పరం చేయాలనే యోచనను స్థానికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పవర్‌ప్లాంట్‌లోని నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటికీ.. అందుకు అవసరమయ్యే ఉద్యోగులను ఇప్పటి వరకూ కాంగ్రెస్ సర్కార్ నియమించనే లేదు. 2020లో పాల్వంచ నుంచి 400 మంది, నిరుడు రామగుండం నుంచి సుమారు 70 మందిని ఇక్కడ పనిచేసేందుకు బదిలీపై రప్పించారు. వీరితోపాటు స్థానికులైన 445 మందిని ఉద్యోగాల్లోకి తీసుకొన్నారు. వీరికి అదనంగా మరో 800 మంది ఉద్యోగుల అవసరం ఉన్నది. ఉద్యోగుల కొరత కారణంగా యాష్, కోల్ ప్లాంట్లను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు జెన్కో టెండర్లు పిలిచింది. పవర్‌ప్లాంట్ ఏర్పాటు సమయంలో పరిసర గ్రామాల్లోని భూనిర్వాతులకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
వీరిలో 333 మంది భూనిర్వాసితులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకొన్నది. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న మరో 67 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంక్రోచర్స్ 440 మంది ఉన్నారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లోని అనేక మంది యువకులు బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్లాంట్‌లో ఉద్యోగుల అవసరం ఉన్నా స్థానికులకు అవకాశం కల్పించడం లేదని యువకులు, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగాలను భర్తీ చేయకుండా, మరోవైపు ఉద్యోగుల కొరత అంటూ ప్రైవేట్‌పరం చేయడంపై స్థానిక యువకులు మండిపడుతున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని ప్రభుత్వం యోచించడంతో గురువారం స్థానికులు ప్లాంట్ వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు అన్ని విధాలా న్యాయంచేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, స్థానికులైన 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా మేరకే ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి సహకరించామని, ఇప్పటి కాంగ్రెస్స ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రైవేట్‌పరం చేసేందుకు పూనుకోవడం దారుణమని పేర్కొన్నారు.
ప్రస్తుతం యాష్, కోల్ ప్లాంట్లతో మొదలై చివరకు మొత్తం ప్లాంట్‌నే ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దీని వల్ల తమ గ్రామాల యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జెన్కో ఇంజినీర్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పాల్వంచ, జూన్ 11: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించొద్దని డిమాండ్ చేస్తూ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో ఇంజినీరింగ్ సంఘాల ఆధ్వర్యంలో 5, 6, 7 దశల కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. యాదాద్రిలోని 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్మాగారంలో టీజీ జెన్కో ఉద్యోగులు, ఇంజినీర్లకు సంబంధం లేకుండా మూడేండ్లపాటు కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి టెండర్లు ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే టెండర్ల నోటిఫికేషన్లను రద్దు చేయాలని, లేదంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
వైటీపీఎస్ ప్రైవేటీకరణకు సర్కార్ పెద్దల స్థాయిలోనే కుట్రలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని, కమీషన్లు ఖరారయ్యాయని సమాచారం. అందుకే ఆ సర్కార్ పెద్దల స్థాయిలోనే ఈ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిందని వివిధ వర్గాలు చెప్తున్నాయి. సర్కార్ పెద్దలు చూపిన కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయని ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. జెన్కో ద్వారా అయితే ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) వ్యయం అధికమని, ప్రైవేట్ కంపెనీ అయితే తక్కువ అవుతుందని కారణాలు చూపడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.