భువనగిరి అర్బన్, డిసెంబర్ 18: ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్‌లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన చెరుకూరి గౌరయ్యకు ఇద్దరు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు ప్రసాద్‌కు ఆరేండ్ల క్రితం వివాహమైంది. అతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అత్తగారిచ్చిన ఎకరం భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రసాద్.. వ్యాపారం చేయాలని ఆ భూమిని రూ.32 లక్షలకు అమ్మాడు. చేతిలో డబ్బులు ఉండటంతో అత్యాశకు పోయి ఆన్లైన్ గేమ్ ఆడాడు. తొలుత రూ.5 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కుటుంబ అవసరాలకు మరో రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. డబ్బులు పోతుండటంతో తండ్రి పేరున ఉన్న వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం పెడతానని అడిగాడు. ఫారం వద్దు వ్యవసాయమే చేసుకోమ్మని తండ్రి సూచించాడు.
తన వద్ద ఉన్న మరో రూ.17 లక్షలతో ఓపెన్ ప్లాట్ కొన్నాడు ప్రసాద్. ఆన్లైన్ గేమ్‌కు బానిసైన ప్రసాద్.. ప్లాట్ పేపర్లు తాకట్టు పెట్టి రూ.15 లక్షల అప్పు తెచ్చుకున్నాడు. ఆ డబ్బంతా ఆన్లైన్ గేమ్‌లో పోవడంతో కుటుంబసభ్యులు మందలించారు. రెండు సెల్ఫీ వీడియోలు తీసి గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో సోమవారం పోస్టు చేశాడు. ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతడి కోసం వెతుకుతున్నారు. వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేటికీ అతడి ఆచూకీ లభించలేదు.