KCR | యాదాద్రి భువనగిరి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కల నెరవేరబోతున్నది. సుందర ఆలయం త్వరలో కొత్త రూపు సంతరించుకోనున్నది. దేవాలయ విమానం గోపురం స్వర్ణమయం కానున్నది. తొలి విడతలో ఈ నెల 15న గోపురానికి బంగారు రేకుల అమరిక పనులకు దేవస్థానం శ్రీకారం చుట్టనున్నది.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు. కానీ స్వరాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ యావత్ దేశం అబ్బురపడేలా యాదగిరిగుట్టను రూ.1200 కోట్లతో పునర్నిర్మాణం చేశారు. ఆలయ గోపురాలు, మాఢవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుషరిణి, యాగశాల నిర్మించారు. కొండపైన విష్ణుపుషరిణి, కొండ దిగువన లక్ష్మీపుషరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణ స్వామి వ్రతమంటపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫె్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురాన్ని బంగారంతో తాపడం చేయాలని కేసీఆర్ భావించారు. 2022 సెప్టెంబర్ 20న కుటుంబ సమేతంగా దర్శించుకుని కేజీ 16 తులాల బంగారం స్వామివారికి విరాళంగా అందించారు. మొత్తం 127 కేజీల బంగారు తాపడం కోసం రూ.65 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు స్వామివారికి పసిడిని సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ విమాన గోపురం స్వర్ణమయం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను అధికారులు ఖరారు చేశారు. తాపడం పనులకు 60 కేజీల బంగారం అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దాతల నుంచి విరాళాల ద్వారా 12 కిలోల బంగారం, రూ.21 కోట్ల నగదు చేకూరినట్టు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా స్వామివారికి భక్తులు సమర్పించిన 2,300కేజీల వరకు వెండి, ఆలయ బ్యాంకు ఖాతాలో విరాళాలు ఉన్నాయి. వీటితో పాటు భక్తుల నుంచి విరాళాలు ద్వారా మిగతా బంగారాన్ని సమకూర్చనున్నారు. ఇక కానుకలు అందించేందుకు ఆన్లైన్ సదుపాయం కూడా ఉందని, భక్తులు సహకరించాలని ఈవో భాసర్‌రావు కోరారు.
ప్రభుత్వం గతంలోనే చెన్నైలోని మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు స్వర్ణ తాపడం పనులను అప్పగించింది. స్వర్ణ తాపడం కూలి పనులకు అవసరమైన రూ.7 కోట్ల మొత్తాన్ని దేవస్థానం చెల్లించనున్నది. స్వామివారి ప్రధానాలయ విమాన గోపురం 10,500 ఎస్ఎఫ్టీల మేరకు ఉంది. ఇప్పటికే రాగి రేకుల పని పూర్తికావడంతో వీటికి బంగారు తాపడం చేపట్టి, విమాన గోపురానికి అమర్చనున్నారు. గోపురం కోసం తయారు చేసిన దేవతల విగ్రహాలతో కూడిన రాగి రేకులను అక్టోబర్‌లో ఆలయ అధికారుల పర్యవేక్షణలో చైన్నైకు తరలించారు. ఇటీవల సుదర్శన చక్రంలో నుంచి చక్ర ఆళ్వార్లను కలశంలోకి ఆహ్వానించే మహా కళావరోహణం నిర్వహించారు. ఈ నెల 15న దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం రేకులు అమర్చే ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. 2025 ఏడాది ఫిబ్రవరి నాటికి తాపడం అమరిక పనులు పూర్తి చేయనున్నారు. అదే నెల 26న మహా సంప్రోక్షణ చేపట్టే అవకాశం ఉంది.