KCR | ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆత్మ గౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు. ఎందుకంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తమ చేతుల్లో పెట్టుకుని.. ఈ ప్రాంతాన్ని కొందరు పాలకులు ఎడారిలా మారిస్తే.. ప్రాణాలకు తెగించి కొట్లాడి పచ్చని మాగాణంలా మార్చాడని వివరించారు.
తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి తనపై జరుగుతున్న దాడిగా భావించాడని సతీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డలపై చూపుతున్న వివక్షను తనపై చూపుతున్న వివక్షగా భావించాడని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను బానిసలుగా చూసి హేళన చేసిన రోజులను చూసి చలించిపోయాడని పేర్కొన్నారు. పదవులను గడ్డిపోచలా పారేసి.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కానివ్వబోమని ఎంతమంది అడ్డుతగిలినా.. అడ్డంకులన్నీ దాటి తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని తీసుకొచ్చి పదేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా.. అభివృద్ధికి ఉదాహరణగా మార్చాడని.. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడని.. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే అని అన్నారు.
వానాకాలంలోనూ గుక్కెడు నీళ్లకు అల్లాడిన నేలలో… ఎండాకాలంలోనూ గంగమ్మ పరవళ్లు తొక్కేలా చేశాడు కేసీఆర్ అని వై.సతీశ్ రెడ్డి కొనియాడారు. వలసలతో వలవల ఏడ్చిన తెలంగాణ కన్నీటిని తుడిచి.. రాష్ట్రాన్ని కడుపులో పెట్టుకుని కన్నబిడ్డలా చూసుకున్నాడని తెలిపారు. కక్షలు కార్పణ్యాలు లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలను.. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసి.. ఒక ప్రశాంతమైన, సుభిక్షమైన తెలంగాణను నిర్మించాడు. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు. దీనికి ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు.. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని అన్నారు.