హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేకతతో సీఎం రేవంత్‌రెడ్డికి మతిభ్రమించిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయని సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడటం విడ్డూరమని తెలిపారు.
ఉప ఎన్నికలు రావంటూనే సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఎం భయపడుతున్నారని, దానికోసం ఇంకెన్ని రోజులు గడువు తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే సీఎం బాగోతం బయటపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే చాన్స్ లేదని, ఆ భయంతోనే ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఢిల్లీలో లాయర్లకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.