Mission Bhagiratha | బాన్సువాడ రూరల్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులో మంగళవారం సరఫరా చేసిన మిషన్ భగీరథ నీటిలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. కొద్ది రోజులుగా రంగుమారిన నీళ్లు వస్తుండగా, తాజాగా పురుగులు కూడా కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
పేదల ఇండ్లకు కరెంట్ కట్ చేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు ప్రశ్నించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లిలో ఏడాదిన్నర నుంచి లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లలో జీవనం గడుపుతున్నారు. గత ప్రభుత్వం వారికి విద్యుత్తు మీటర్లు అమర్చి కరెంట్ సరఫరా చేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో మంగళవారం అధికారులు కాలనీకి కరెంట్ కట్ చేశారు. కాలనీలో ముగ్గురు రూ.8వేలు, 9వేలు, 10వేల బిల్లులు బకాయి ఉండగా, మిగతా 37మంది రూ.వందల్లో మాత్రమే బకాయి ఉన్నారు. కొందరు బిల్లులు చెల్లించినా కరెంట్ కట్ చేశారు. గత పదేండ్ల పాలనలో అధికారులు ఇంత దురుసుగా ప్రవర్తించలేదని బాధితులు వాపోయారు. కరెంట్ కట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని కోరారు.
– పాలకుర్తి
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఏటిధర్పల్లివాసులు గ్రామ వాగు నుంచి ఇసుక తరలించనీయమని మూకుమ్మడిగా తీర్మానించారు. ఈ కాపీని అధికారులకు అందజేశారు. ఇసుక కొరతతో ప్రభుత్వం ఇటీవల గ్రామ శివారులోని దుందుభీ నదిలో రీచ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం సమావేశమయ్యారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు హాజరై ఇసుక రీచ్ ఏర్పాటుకు సహకరించాలని గ్రామస్తులను కోరారు. దీంతో రీచ్ పెట్టాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని పలువురు పురుగుల మందు డబ్బాలతో అధికారుల ముందుకు వచ్చారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరగగా సమస్య సద్దుమణిగింది.
– తాడూరు
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు రామకృష్ణ, జార్జిరెడ్డి, సురేశ్, మస్తాన్ మాట్లాడుతూ కళాశాలలు బకాయిలు చెల్లించలేదనే సాకుతో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ ఫలితాలు నిలిపివేడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.
– ఖమ్మం అర్బన్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును యథాతథంగా ఉంచాలని కోరుతూ ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య సంఘం, ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి ఆర్యవైశ్యుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్యులకు పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
– ఖమ్మం