World Rice Conference | హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని అధికారులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
స్వాతంత్య్రం అనంతరం మన దేశంలో వరి ఉత్పత్తి దాదాపు 8రెట్లు పెరిగి, 14 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందని చెప్పారు. వరి ఎగుమతులలో భారతదేశ వాటా దాదాపు 45శాతంగా ఉందని, మన దేశం నుంచి వివిధ రకాల వరి ధాన్యం సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలాంటి వరి మిగులు రాష్ట్రాలకు వరి ధాన్యాన్ని ఎగుమతి చేసే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన సూచించారు.