యాదాద్రి భువనగిరి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): భూదాన్‌పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఇకత్ చేనేత కార్మికులతో మాట్లాడి, పోచంపల్లి టూరిజం టెక్స్టైల్ పారులో పోచంపల్లి ఇకత్ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకత్ చీరలు, ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని, ఇటీవల ప్రపంచ సుందరీమణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిపారు. ఇకత్ ఉత్పత్తులకు మారెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే చేనేత కార్మికులను కాపాడిన వారమవుతామని చెప్పారు.
నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులు, జీవన విధానాలు, ఇకత్ ఉత్పత్తుల తయారీలో వారు ఎదురొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేత కార్మికులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన పొదుపు, నేతన్నకు బీమా స్కీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘30 సంవత్సరాల నుంచి మగ్గం నేస్తున్నా. చిన్నప్పుడే భర్త చనిపోతే నలుగురు పిల్లల్ని చేనేత పైన ఆధారపడి బతికించుకుంటున్నా. ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం పెట్టడం బాగుంది’ అని భారత గగన అనే నేత కార్మికురాలు తెలిపారు. ‘త్రిఫ్ట్ పథకంలో చేరి 36 నెలలు రెండు వేల రూపాయల చొప్పున చెల్లించాం. ప్రస్తుతం రెండు లక్షలు వచ్చాయి. దీని ద్వారా ఇళ్లు నిర్మించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది’ అని గుర్రం హేమలత పేర్కొన్నారు. మరో నేత కార్మికురాలు శశికళ మాట్లాడుతూ చేనేత బీమా పథకం వల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.