World bank | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు రూ.4,150 కోట్ల అప్పు ఇవ్వనున్నది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పలు కార్యక్రమాల అమలుకుగాను రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాం కు అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారికి లేఖ పంపింది. రాష్ట్రంలో వైద్యరంగంలో కార్యక్రమాల అమలు, ఫలితాల ఆధారంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రపంచబ్యాంకు బృందం రాష్ట్రంలో నాలుగు రోజులు పర్యటించి.. వైద్య ఆరోగ్యశాఖతో కలిసి పనిచేయనుంది.
ప్రపంచబ్యాంకు సాయం కోసం గత సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సర్కారు దవాఖానాల్లో మౌలిక వసతుల కోసం రూ.4,944 కోట్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కాగా ప్రపంచబ్యాంకు రూ.4,150 కోట్లకు పచ్చజెండా ఊపింది. ఈ నిధులను ప్రధానంగా స్పెషాలిటీ దవాఖానల్లో పరికరాల కొనుగోలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రామా కేర్ల ఏర్పాటుకు వినియోగించనున్నారు. వీటితోపాటు మహిళలు, వయోవృద్ధుల ఆరోగ్యం, అసాంక్రమిక వ్యాధులకు నిధులు వెచ్చించనున్నారు. జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటరుకు ఒక ట్రామాకేర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.