హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటిని పచ్చని తోటగా మార్చే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ). టెర్రస్, బాల్కనీ, బ్యాక్ యార్డ్‌లలో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు, తోటల పెంపక నైపుణ్యాలు నేర్చుకోవడం, అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవడం కోసం 2019లో 200 మందితో చిన్న వాట్సాప్ గ్రూప్‌గా సీటీజీ ఏర్పాటైంది. గడిచిన మూడేండ్లలో ఈ గ్రూప్‌లో మొంబర్షిప్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం 33 పైగా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో 26 వేల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీరంతా కలిసి సరికొత్త ఉద్యమానికి తెరలేపారు. మిద్దెతోటలు, పెరటితోటలు, బాల్కనీల్లో రసాయన రహిత కూరగాయలు, పండ్లను పండించడాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి మొదలుపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌హోమ్స్ లక్ష్యాన్ని విస్తరించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
రూఫ్‌టాప్ గార్డెన్లపై వర్క్‌షాప్‌లు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2022 సందర్భంగా సీటీజీ బృందం రూఫ్‌టాప్ గార్డెన్ల పెంపకాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు గార్డెనింగ్ ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఇంటి పైకప్పు పటిష్టత, కుండీల ఎంపిక, విత్తనాలు, మొక్కలు, నేలకూర్పు, తెగులు నివారణతో పాటు రూఫ్‌టాప్ గార్డెన్ల వాస్తు, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నది. ఇందుకోసం సీటీజీ సభ్యులు ప్రతి కాలనీ, ప్రతి వీధి, ప్రతి ఊరు తిరగాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉండే విద్యాసంస్థలు, నివాస సంక్షేమ సంఘాల కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రౌండ్లలో ఈ ఏడాది మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నేడు కేబీఆర్ పార్కు వద్ద అవగాహన కార్యక్రమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజున కేబీఆర్ పార్కు ముందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉదయం 6 గంటల నుంచి 8.30 మధ్యలో అక్కడికి రావొచ్చు. మా వలంటీర్లు 300 మంది అందుబాటులో ఉంటారు. ర్యాలీ కూడా తీస్తున్నాం. హాజరయ్యే ఔత్సాహికులకు మొక్కలు, విత్తనాలు ఉచితంగా అందజేస్తాం.
– సాయి రమణ, సీటీజీ ప్రతినిధి
నేడు ఎన్విరాన్మెంటల్ వాక్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పర్యావరణ వాక్ నిర్వహించనున్నట్టు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ గ్రూప్) వ్యవస్థాపక సభ్యుడు హర్కార శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఉదయం 6:30 గంటలకు వాక్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.