హన్వాడ, జూలై 4: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సాధన సమితి వైస్ చైర్మన్ బెక్కెం జనార్దన్ కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల లో మీడియాతో మాట్లాడారు.
చెంతనే కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు పారుతున్నా.. చుక్కనీరు ఉపయోగించుకోకుండా వర్షాధారంపై రైతులు, ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 40లక్షల ఎకరాల భూములు సాగుకు యోగ్యమైనవి ఉన్నా.. సర్కార్ నిర్లక్ష్యంగా కారణంగా సాగునీరు లేక బీళ్లుగా మారాయని మండిపడ్డారు. రోజురోజుకూ జూరాల ప్రాజెక్టులో సిల్ట్ నిండిపోతున్నదని తెలిపారు. ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మేధావులతో 19న జిల్లాలోని క్రౌన్ గార్డెన్స్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.