రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ -30 నగరాల్లో ఒకటిగా నిలుపటమే మా లక్ష్యం. వచ్చే సంక్రాంతి నాటికి 100 శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందుతుంది. హైదరాబాద్‌లో భవిష్యత్తు తరాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా సుంకిశాల వద్ద రూ.1,450 కోట్లతో ఇన్‌టేక్‌వెల్ నిర్మిస్తున్నాం.
– మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని టాప్ -30 నగరాల్లో ఒకటిగా నిలుపటమే తమ లక్ష్యమని ప్రకటించారు. మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, పట్టణాలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో మున్సిపల్ శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పట్టణ ప్రాంతం ఎక్కువ ఉన్నందున, మరికొన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపికచేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు.
50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు ఒక అధికారి, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న చోట వార్డుకు ఒక అధికారిని నియమించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. వచ్చే సంక్రాంతి నాటికి 100 శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో భవిష్యత్తు తరాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా సుంకిశాల వద్ద రూ.1,450 కోట్లతో ఇన్‌టేక్‌వెల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా పట్టణాలకు రూ.4 వేల కోట్లు కేటాయించామని, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పది పట్టణాల్లో రూ.2,410 కోట్లతో 104 రోడ్లు వేస్తున్నామని వివరించారు. టీఎస్ బీపాస్ ద్వారా 1.15లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ 3,500 కోట్ల విలువైన టీడీఆర్ ధ్రువపత్రాలు జారీ చేసిందని చెప్పారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట వరకు 29 కిలోమీటర్లఎలివేటెడ్ బీఆర్టీఎస్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
దేశంలో స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ ఎంతో ముందున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2021లో నివాస విభాగంలో 142 శాతం క్రయవిక్రయాలు జరిగాయని చెప్పారు. నైట్‌ఫ్రాంక్ సంస్థ అధ్యయనంలో దేశంలోని 8 మెట్రో నగరాల్లో 2014 నుంచి వరుసగా ఒక్క సంవత్సరం కూడా స్థిరాస్తి ధర తగ్గని ఒకే ఒక్క మెట్రో నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని వెల్లడించారు. ‘బిల్డర్లు నిర్మించిన గృహాలకు కొనుగోలుదారులను ఆకర్షించగలిగే కాలం’ (హౌసింగ్ ఇన్వెంటరీ ఓవర్హ్యంగ్) 2021 మొదటి త్రైమాసికంలో 53 నెలలు ఉండగా, 2022 అదే కాలంలో 27 నెలలకు తగ్గిందని తెలిపారు. చదరపు అడుగుకు రూ.4,450 రేటుతో దేశంలోని మొదటి 7 మెట్రో నగరాల్లో హైదరాబాను అత్యంత సరసమైన నగరంగా అనరాక్ ఎంపికచేసిందని గుర్తుచేశారు.
2021లో తెలంగాణకు 12 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. కేంద్రప్రభుత్వం పారదర్శకంగా అవార్డులిస్తే ప్రస్తుత సంవత్సరం అంతకంటే ఎక్కువే వస్తాయని అన్నారు. ప్రధానమంత్రి స్వనిధిలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలివ్వడంలో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉన్నదని, పట్టణాలు, నగరాల్లో జనాభాపరంగా దేశంలోని మొదటి పది మనవేనని వివరించారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ అవార్డులు కూడా రాష్ర్టానికి వస్తున్నాయని చెప్పారు. లివింగ్, ఇన్‌క్లూజివ్ శ్రేణి విభాగంలో స్మార్ట్‌సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని డబుల్ బెడ్రూం పథకం ఫైనలిస్ట్‌గా ఎంపికైందన్నారు.
ఐటీ శాఖ గ్లామరస్ జాబ్ అని, మున్సిపల్ శాఖది మాత్రం థాంక్‌లెస్ జాబ్ అని మంత్రి వ్యాఖ్యానించారు. మున్సిపల్ శాఖలో పనిచేయకుంటే అందరు విమర్శిస్తారని, పనిచేస్తే మాత్రం ఒక్కరూ అభినందించరని చెప్పారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం పనిచేస్తున్నారని అభినందించారు. పట్టణ ప్రగతి కింద పట్టణాలు, నగరాలకు రూ.3,700 కోట్లకుపైగా విడుదల చేశామని తెలిపారు. నాలాల మీద ఇండ్లు కట్టుకొనేవారిని మానవవీయ కోణంలో చూడాల్సి ఉంటుందన్నారు. మూసీపై అక్రమంగా ఇండ్లు నిర్మించుకొన్నవారికి వసతి కల్పించడానికి డబుల్ బెడ్రూం ఇండ్ల్లు కేటాయిస్తామని తెలిపారు. 111 జీవోకు హైదరాబాద్ వరదలకు సంబంధం లేదని, దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో పట్టణ జనభాలో తమిళనాడు 48.45 శాతంతో మొదటి స్థానంలో ఉంటే.. 47.23 శాతం కేరళ రెండు,46.8 శాతంతో తెలంగాణ మూడో స్థానం లో ఉన్నాయని వెల్లడించారు. 2025-26 నాటి కి రాష్ట్రంలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొంటుందని చెప్పారు. 2050 నాటికి దేశంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని నీతిఅయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారని, కానీ, తెలంగాణలో 2026 నాటికే ఆ మా ర్క్ చేరుకొంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 68 పట్టణాలుండగా, ప్రస్తుతం 142కు చేరాయని చెప్పారు. రాష్ట్ర విస్తీర్ణంలో పట్టణాలు 3 శాతం భూభాగంలోనే ఉండగా, జనాభా మాత్రం 46 శాతం ఉన్నదని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కు మార్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.