డ్రోన్ల ద్వారా భూముల సర్వేకు ఏర్పాట్లు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : గ్రామకంఠం భూముల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. మండలాలు, గ్రామాల వారీగా ఆబాదీ, నాన్ ఆబాదీ భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ) ప్రాంగణంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపిక చేసిన గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులతో గ్రామ కంఠం భూముల సర్వేపై సమావేశం నిర్వహించారు.
ఈ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని, డీపీవోలు ఆ దిశగా పనిచేయాలని దయాకర్‌రావు సూచించారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో కలిపి మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈలోగా గ్రామస్థాయిలో ఉన్న సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మెదక్ జిల్లా కొత్తపల్లి, మల్లంపేట, మహబూబ్‌నగర్ జిల్లా అన్నారెడ్డిపల్లి, నంచెర్ల పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టామని వెల్లడించారు. అలాగే ‘స్వామిత్వ’ పథకం కింద సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతీగూడ, మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి, కామారెడ్డి జిల్లా దోమకొండలో పైలట్ ప్రాజెక్టు కింద డ్రోన్ల ద్వారా గ్రామ కంఠాలకు సంబంధించి కొత్త మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నామని వివరించారు. సమావేశంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల నుంచి సలహాలు తీసుకున్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.