హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో కార్మికులతో దారుణంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 18 గంటలకుపైగా గొడ్డు చాకిరి చేయించే బదులు కాస్త విషమించి చంపడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 18వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘రోజుకు 16 గంటల డ్యూటీ’ శీర్షికన ప్రచురితమైన కథనం అక్షర సత్యమని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. ఆ కథనం ప్రచురితమైన మరుసటి రోజే ఆర్టీసీ యాజమాన్యం ‘నమస్తే తెలంగాణ’కు రిజాయిండర్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు హకులను పూర్తిగా హరించివేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ కార్మికున్ని కదిలించినా పెంచిన పని గంటలతో రోజూ చచ్చిపోతున్నామని అంటున్నారు. ‘ఇంతలా డ్యూటీలతో చంపే బదులు ఒకేసారి కాస్త్త విషమిచ్చి చంపండి’ అని ‘నమస్తే తెలంగాణ’తో ఆవేదన చెందారు. ఆర్టీసీ సంస్థలో రోజుకు ఎనిమిది గంటలే పని కల్పిస్తున్నామని, చట్టవ్యతిరేక పనిభారాలు లేవని, డ్రైవర్లకు కండక్టర్ పని కూడా చేయాలని బలవంతంపెట్టడం లేదంటూ రెండు పేజీలతో అబద్ధాలతో కూడిన ఖండనను ‘నమస్తే తెలంగాణ’కు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోల్లో తాము అనుభవిస్తున్న విషయాలను వెల్లడించారు.
రీజియన్ డిపోల్లో ఏ డిపో కార్మికుడిని కదిలించినా.. ఈ పనిభారం తాళలేకపోతున్నామని అంటున్నారు. రన్నింగ్ సమయం తగ్గించడంతో రోజుకు 12-18 గంటల పని చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఆర్టీసీలో గతంలో రూట్ సర్వే నిర్వహించి శాస్త్రీయంగా ఆయా రూట్లలో రన్నింగ్ టైం, హాల్టింగ్ టైం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ‘ఎంటీడీ 141’ (బస్సుల సమయ సారిణి) ఆయా డిపో అధికారులే తయారుచేసేవారు. డ్యూటీ రిపోర్టింగ్ సమయం, క్యాష్, బస్ అప్ప జెప్పే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎనిమిది గంటలకు డే అవుట్ (ఒకరోజు డ్యూటీ), లాంగ్‌రూట్ లేదా ఎకువ ట్రిప్పులు ఉంటే 12 గంటలు, తదేకంగా డ్యూటీ చేస్తే ఎంటీడబ్ల్యూ యాక్టు ప్రకారం స్పెషల్ ఆఫ్ (రెండు రోజుల మస్టర్) ఇచ్చేవారు. కానీ, నేడు అందుకు భిన్నంగా ఆర్టీసీ హెడ్ ఆఫీసు అయిన బస్‌భవన్ నుంచే బస్ రన్నింగ్ సమయాన్ని అశాస్త్రీయంగా అధికారులు ఘోరంగా తగ్గిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. అడ్డగోలుగా డ్యూటీని విభజిస్తున్నారని, మధ్యలో రెస్ట్ అవర్ లేకున్నా.. ఒకరోజు డ్యూటీలో 4-8 సార్లు రెస్ట్ ఇస్తున్నట్టు 141 కాగితంపై చూయిస్తున్నారని, ఇది అవాస్తవమని పేర్కొన్నారు. నిజామాబాద్-నిర్మల్, నిర్మల్-నిజామాబాద్.. రన్నింగ్ సమయం రెండు గంటలు కాగా, 1.35 నిమిషాలుగా చూపిస్తున్నారని మండిపడుతున్నారు. నిర్మల్-జేబీఎస్, జేబీఎస్-నిర్మల్ టిప్పులకు ఎనిమిది గంటలు చూపిస్తున్నారని, కానీ 12 గంటల సమయం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రెండురోజుల డ్యూటీని ఒకరోజుకు కుదించలేదని ఆర్టీసీ యాజమాన్యం చెప్పడం అబద్ధమని కార్మికులు అంటున్నారు. స్పెషల్ ఆఫ్ సర్వీసుల పేరుతో (రెండు రోజుల మస్టర్ డ్యూటీలను) సింగిల్ క్రూలుగా మార్చి.. ఒకరోజు మస్టర్ ఇచ్చి.. 12-14 గంటలు పనిచేయిస్తున్నారని మండిపడుతున్నారు. వాటికి తూతూ మంత్రంగా గంట, గంటన్నర ఓటీలు చెల్లిస్తూ అదనంగా 5 గంటలకుపైగా శ్రమదోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు. ఉదాహరణకు ఆదిలాబాద్ రీజియన్‌లోని నిర్మల్ డిపో నుంచి నిజామాబాద్‌కు మూడు ట్రిప్పులు, నిజామాబాద్-1, 2 డిపోల నుంచి నిర్మల్‌కు మూడు ట్రిప్పుల సర్వీసులు ఇరవైకిపైగా నడుస్తున్నాయి. ఈ బస్సులు డిపో నుంచి బయలుదేరి, మళ్లీ డిపోకు చేరేసరికి సరాసరి 13 గంటలకు పైగానే సమయం పడుతున్నదని చెప్తున్నారు. గతంలో ఇలా ఉంటే రెండురోజుల మస్టర్ ఇచ్చేవారని, కానీ, ఇప్పుడు 13 గంటలకుపైగా పనిచేస్తున్నా 1.35 నిమిషాలు ఓటీని మాత్రమే చెల్లిస్తూ తీవ్రమైన శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో 2014లో ఆర్టీసీలో 57,500 మంది కార్మికులు ఉంటే, నేడు 38,500 మంది ఉన్నారని కార్మికులు అంటున్నారు. దాదాపు 20 వేల మంది సిబ్బంది తగ్గినా.. కొత్తగా రిక్రూట్మెంట్లు చేయడంలేదని, దీంతో ఆ 20 వేల మంది పనిభారం మిగిలిన వారిపై పడటంలేదా? అని ప్రశ్నిస్తున్నారు. తిరగాల్సిన బస్సులు భారీగా తగ్గించి, తిరగాల్సిన కిలోమీటర్లు మాత్రం పెంచారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల బోధన్ డిపోలో అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో డ్రైవర్లందరూ టిమ్ మిషన్ నేర్చుకోవాలని, లేకపోతే డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. గతంలో నిజామాబాద్-1 డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న డీ సంజీవ్ అనే ఉద్యోగి ప్రశ్నించినందుకే అన్యాయంగా సస్పెండ్ చేయడం వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు.
2024, 2025లో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగులు పని ఒత్తిడితోనే చనిపోయారని తోటి కార్మికులు చెప్తున్నారు. సంస్థలో పనిభారం పెరగడం వల్లనే డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారని అంటున్నారు. గంటల తరబడి డ్రైవర్ సీట్లో కూర్చోవడంతో డ్రైవర్లు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. సరైన నిద్రలేక, సమయానికి తిండిలేక పక్షవాతం బారిన పడినవారు వందల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బోధన్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ డ్యూటీ 18-19 గంటలు పడుతుందని కార్మికులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్లి రావడానికి 14 గంటల సమయం పడుతుండగా.. దానికి స్పెషల్ ఆఫ్ ఇస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నది. అయితే, అదే బాన్సువాడ నుంచి వరంగల్ వెళ్లి రావడానికి 18 గంటల సమయం పడుతున్నదని, న్యాయంగా స్పెషల్ ఆఫ్ ఇచ్చి నాలుగు గంటలు ఓటీ ఇవ్వాలని, కానీ అవేమీ ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. అక్రమంగా ఇలా 18 గంటలు డ్యూటీ చేయించడం అన్యాయం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. భైంసా నుంచి నాలుగు ట్రి ప్పులు ఆర్డినరీ సర్వీసులకు గతంలో స్పెషల్ అఫ్ ఇచ్చేవారని, ఇప్పుడు ఈ డ్యూటీకి 14 గంటల సమయం పడుతుంటే నేడు సింగిల్ క్రూలుగా మార్చి.. రెండున్నర గంటల ఓటీ చెల్లిస్తూ తీవ్రమైన శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. బాన్సువాడ-నిజామాబాద్‌కు నాలుగు ట్రిప్పులు ఎక్స్‌ప్రెస్ సర్వీసు గతంలో 12 గంటలు, 419 కిలోమీటర్లు తిరిగేవని చెప్తున్నారు. మొత్తంగా 13 గంటల సమయం పడితే.. గతంలో స్పెషల్ ఆఫ్ ఇచ్చేవారని, కానీ, నేడు గంటన్నర ఓటీ మాత్రమే చెల్లిస్తూ శ్రమదోపిడీ చేయడం వా స్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్‌లోనే 500కుపై గా బస్సులను సింగిల్ క్రూలుగా మార్చి, కార్మికుల రక్తం తాగడంలేదా? ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వేల సర్వీసులను సింగిల్ క్రూలుగా మార్చి ఉంటారు?’ అని నిలదీస్తున్నారు.