Telangana | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తిచేయాలని నిధులు గురించి మాత్రం అడగొద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పని ఒత్తిడి, మరోవైపు నిధులు లేక వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చు చేయాల్సి వస్తున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ ఇచ్చే నిధులు, పన్నుల వసూళ్లు పంచాయతీలకు ఆర్థిక వనరులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంలేదు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులు ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇవ్వడంలేదు.
అవగాహనలేని ప్రత్యేక అధికారులు
జనవరితో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరిలో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. వారిలో కొందరికి గ్రామ పాలనపై అవగాహన లేక పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం కరెంట్ బిల్లులు, బోరు మరమ్మతులు, ట్రాక్టర్లకు డీజిల్ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్పెషల్ ఆఫీసర్లకు నిధులు, విధులపై స్పష్టత లేకపోవడంతో కార్యదర్శులకే పని భారమౌతున్నది. గ్రామ సిబ్బందికి నెలల కొద్దీ జీతాలు రాకపోవడంతో సొంత డబ్బులు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకునే పరిస్థితి నెలకొన్నదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాగునీటి మోటర్లు, పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు తమపైనే భారం పడిందని కార్యదర్శులు చెప్తున్నారు. తాజాగా శ్మశాన వాటికలకు కరెంటు, నీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టారని, మరి నిధులు ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే పనులు అమలు చేయడమే తప్ప వాటికి నిధుల విషయం తమకు సంబంధం ఉండదని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడం సమంజసం కాదని అంటున్నారు.