మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట, దోమలపెంట: మరో మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో తిరిగి సొరంగం పనులు ప్రారంభిస్తామని వివరించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొస్తామని చెప్పారు. గురువారం దోమలపెంటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలోని పేరెన్నిక గన్న నిపుణులతో సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
బాధితులను రక్షించేందుకు దక్షిణ మధ్యరైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ నిపుణుల బృందాన్ని కూడా రప్పించామని చెప్పారు. టన్నెల్లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటకు పంపుతూ, బురదను తొలగిస్తూ, టీబీఎం ముందు భాగం వరకూ రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేస్తామని వివరించారు.