న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన ఎక్స్‌లో తెలిపారు. కాగా, ఇప్పటికే పలు పార్లమెంటరీ కమిటీలు సమావేశమై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
వివాదాస్పద 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను ఆమోదించనుంది. ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. తీవ్రమైన కేసులో అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో వరుసగా 30 రోజుల పాటు ఉంటే భారత ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను స్వయంచాలకంగా పదవుల నుంచి తొలగించాలనే బిల్లులోని అత్యంత చర్చనీయాంశమైన నిబంధనను బిల్లులో యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే వివాదాస్పదమైన ఈ బిల్లును ఇప్పటికే పలువురు నేతలు తిరస్కరిస్తున్నారు.
అవినీతిని అరికట్టడానికి నిర్దేశించిన లక్ష్యం కన్నా, దీనిని రాజకీయ ప్రతీకారాలకు, ఉద్దేశపూర్వక ప్రయోజనాలను నెరవేర్చడానికి అధికార పార్టీలు ఉపయోగించే ప్రమాదముందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికార పార్టీ వాదిస్తున్నది. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనికుల మరణంపై సభను సూటిగా స్పష్టమైన అబద్ధాలతో తప్పు దోవ పట్టించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఈ సమావేశాల్లో హక్కుల ఉల్లంఘన ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.