న్యూఢిల్లీ: టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో విచ్చలవిడిగా సాగుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో, విజువల్ మెటీరియల్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ తాజాగా టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌కు శనివారం నోటీసులు పంపింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఛానళ్లు, గ్రూపులపై 15 రోజుల్లోగా కఠిన చర్యలు తీసుకుని పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది.
గతంలో ప్రభుత్వం పైరసీ కంటెంట్ కలిగిన మూడు వేలకుపైగా టెలిగ్రామ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్నది. దేశంలో కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం కాపీరైట్ ఉల్లంఘన అనేది క్రిమినల్ నేరమని కేంద్రం గుర్తు చేసింది. ఈ నోటీసులకు స్పందించకుంటే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని ‘టెలిగ్రామ్’యాప్‌ను హెచ్చరించింది. దేశంలోని సృజనాత్మక రంగం, సినిమా పరిశ్రమ, ఓటీటీ ప్లాట్‌ఫారాలు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను రక్షించేందుకే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.