ప్రసిద్ధ దేవాలయాల్లో ‘హుండీ చోరీ’లు ఎన్నెన్నో కాశీ టెంపుల్ నుంచి షిర్డీ, పూరీ వరకూ అంతే అయోధ్య వివాదం నేపథ్యంలో సర్వత్రా చర్చ
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయం విరాళాల చోరీ ఘటన యావత్తూ దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. కేసును విచారిస్తున్న కొద్దీ బయటపడుతున్న అక్రమాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అయితే, ఆలయాల హుండీ చోరీ ఘటనలు ఒక్క అయోధ్యకే పరిమితం కాలేదని, గడిచిన 12 ఏండ్లలో దేశంలోని ప్రఖ్యాత ఆలయాల్లోనూ ఇవే తరహా ఘటనలు జరిగాయని విశ్లేషకులు చెప్తున్నారు.
కాశీ విశ్వనాథ మందిరం, ఉత్తరప్రదేశ్ మోక్షానికి చిరునా మాగా భావించే జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని విశ్వనాథ ఆలయం కూడా దొంగలబారిన పడింది. ఆలయంలో పనిచేసే కొందరు 2019లో హుండీ లెక్కింపు సమయంలో ఏకంగా విరాళాల బాక్స్లనే పక్కకు తప్పించినట్టు కేసులు ఉన్నాయి.
మహా కాళేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర్ టెంపుల్లోనూ 2022లో విరాళాల సొమ్ము పక్కదారిపట్టినట్టు
ఆరోపణలు ఉన్నాయి.
అనంత పద్మనాభస్వామి ఆలయం, కేరళ ప్రపంచంలోని అత్యంత సుసంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 2016లో చోరీ జరిగినట్టు వార్తలు వచ్చాయి. సెక్యూరిటీ కండ్లు గప్పి కొందరు విలువైన కానుకలను అపహరించినట్టు సమాచారం.
సిద్ధి వినాయక టెంపుల్, మహారాష్ట్ర ముంబైలో అత్యంత ఐశ్వర్యవంతమైన ఆలయంగా పిలిచే సిద్ధి వినాయక టెంపుల్కు వచ్చిన విరాళాలను కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు అపహరించినట్టు 2017లో కేసు నమోదైంది. దొంగిలించిన సొమ్ము విలువ రూ. కోట్లలో ఉన్నట్టు సమాచారం.
షిర్డీ సాయిబాబా మందిరం, మహారాష్ట్ర మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో 2015లో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు, బయటివారితో చేతులుకలిపి హుండీలోని లక్షల రూపాయలను, కానుకలను అపహరించినట్టు కేసు నమోదైంది.