హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రతి మండల కేంద్రంలో భవనాలు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అవసరమైతే గ్రామాల్లో కూడా మహిళా వేదికలను నిర్మిస్తామని చెప్పారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వయం సహాయక బృందాలకు నాబార్డు, మహిళా అభివృద్ధి సమాఖ్య, ఎనేబుల్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు అత్యధిక రుణాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని గర్వంగా చెప్తానని అన్నారు. వడ్డీలేని రుణాలకు సంబంధించిన మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. స్వయం సహాయక మహిళలు చనిపోతే వారు తీసుకొన్న రూ.3 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తున్న మహిళలకు కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మాజీ సీఎస్ కాకి మాధవరావు, నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య, సాధన్ సంస్థ సీఈవో మీనన్, బర్డ్ డైరెక్టర్ శంకర్ పాండే, ఏపీ మాస్ వైస్ చైర్మన్ మహిపారాలి, సీఈవో సీఎస్‌రెడ్డి, చైతన్య మేనేజింగ్ ట్రస్టీ సుధా కొఠారి తదితరులు పాల్గొన్నారు.