హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాలని పలువురు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తుది ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
హారిజాంటల్ విధానంలో వందలో 33.33 పోస్టులు రిజర్వు చేస్తారు. వర్టికల్ విధానంలో ఆయా క్యాటగిరీలవారీగా భర్తీ చేయబోయే పోస్టుల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్లు అమలుచేస్తారు. క్యాటగిరీలవారీగా సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల వెల్లడికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.