హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోనూ అమలు చేసేందుకు సంకల్పించామని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా తెలిపారు. ఈ మేరకు యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎన్ఐ-ఎంఎస్ఎంఈ) వేదికగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్(టీఓటీ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. మహిళలతో ప్రవర్తించే తీరుపై సమాజం, విద్యార్థుల్లో మార్పు తీసుకురావడమే ఉద్దేశమని పేర్కొన్నారు. లింగవివక్ష ధోరణులను సవాల్ చేయడం, మహిళలకు అన్యాయం జరిగితే దానిని గుర్తించి నిలదీసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు.