Congress | కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తీరుపై రైతుల్లో విభిన్న రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను రైతులు ఊరూ ర తగలబెట్టారు. ఇప్పుడు మహిళా రైతు లు, కూలీలు కూడా కాంగ్రెస్‌పై మండిప డుతున్నారు. సీఎం కేసీఆర్ పథకాలను మెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్‌పై మండిపడుతూ పాటలు కైగడుతున్నారు. మహిళలు నాట్లు వేస్తూనే ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో ప్రశంసిస్తున్నారు.
“కరంటు ఇచ్చేది ఉయ్యాలో..
కేసీఆర్గాద ఉయ్యాలో..
రైతుబంధు ఇచ్చె ఉయ్యాలో..
కేసీఆర్గాద ఉయ్యాలో..
రొండు వేల పిన్సిని ఉయ్యాలో..
పిల్చిఇచ్చినాడు ఉయ్యాలో..
కేసీఆర్ అన్న ఉయ్యాలో..
సాయంజేత్త ఉండు ఉయ్యాలో..
లచ్చ రూపాలైతే ఉయ్యాలో..
కల్యాణ లచ్చిమి ఉయ్యాలో..
కల్యాణ లచ్చిమి ఉయ్యాలో..
లచ్చిమిచ్చినాడు ఉయ్యాలో..
కేసీఆరునైన ఉయ్యాలో..
ఎప్పటికి మరువం ఉయ్యాలో..
కాంగ్రెసునైతే ఉయ్యాలో..
తరిమి కొట్టుతాము ఉయ్యాలో”
ఇపుడు ఇవీ తెలంగాణ చేను సెలకల్లో వినిపిస్తున్న పల్లె రాగాలు. శ్రమను మర్చిపోయేందుకు పాడుకునే పాటల్లో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చేరాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న సహాయాన్ని కూలీ తల్లులు పాటలుగా అల్లుకుని శ్రమ గీతాలు ఆలపిస్తున్న రు. 24 గంటల కరెంట్ ఇస్తున్నడు.. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు ఈ శ్రమ జీవుల పాటలకు ఇతి వృత్తాలు అవుతున్నాయి. వెనకట రాక్షసుల పాలన చూపిన కాంగ్రెస్ పార్టీ వస్తే తరిమి కొడతామని పాటలు కైగట్టుకుని పాడుకుంటున్నరు. అందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లా గంగాధర మం డలం లింగంపల్లిలో నాట్లు వేస్తున్న కూలీల ఉయ్యాల పాటలు. ఈరవేణి మల్లవ్వ కైగట్టి పాడిన పాటకు తోటి కూలీలు గొంతుకలిపిన తీరు ఎంతగానో ఆకట్టుకున్నది.
కాంగ్రెసోళ్లు ఊళ్లెకత్తే తరిమి కొట్టుడే..
కేసీఆర్.. మా అన్న.. మాకు రైతు బంధు ఇత్తున్నడు. రైతులెవలన్న చనిపోతే రైతుబీమా ఇత్తున్నడు. కేసీఆర్ వచ్చిన కాన్నుంచి నీళ్లత్తన్నయ్, కరంటత్తంది. మంచిగ పంటలు పండించుకుంటున్నం అనుకుంటే ఇపుడు రేవంత్‌రెడ్డి వచ్చి గట్ట మాట్లాడితే మేం ఊకుంటమా.. మా ఊళ్లెకు ఏ కాంగ్రెసోడచ్చినా తమిరి కొడ్తం. ఇన్నొద్దులు ఊళ్లె నీళ్లు లేక, కరంటి లేక దేశాలువట్టుకొని తిరిగచ్చినం. కేసీఆర్ అచ్చినంకా ఊళ్లెకచ్చినం. రేవంత్‌రెడ్డి మాటలు సూత్తే మళ్ల ఊళ్లు వట్టుకొని పొమ్మన్నట్టే ఉన్నది.
– ఈరవేణి మల్లవ్వ, లింగంపల్లి, కరీంనగర్ జిల్లా.
‘నిరహార దీక్ష పట్టిండే నా తండ్రి కేసీయార్..
తెలంగాణ తెచ్చిండే నా తండ్రి కేసీయార్..
లోక రక్షకుడే నా కేసీయార్..
రైతులందరికీ తండ్రి లాంటోడే నా కేసీయార్..
అందరం అండగా ఉండుడే నా తండ్రి కేసీయార్‌కు..’
అంటూ సాయిని సత్తవ్వ ఎనిమిది పదుల వయస్సులో జననేతపై ఉన్న తన అభిమానాన్ని చాటుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కర్ణపేట రైతువేదికలో బుధవారం జరిగిన రైతుసభలో హుషారుగా మైక్ పట్టుకొని పాట అందుకుంది. దీంతో అక్కడున్న రైతులందరూ చప్పట్లతో హోరెత్తించారు. ‘జై బీఆర్ఎస్.. జై జై కేసీఆర్’ అంటూ నినదించారు.
-దండేపల్లి