రంగారెడ్డి: రైలు పట్టాలపై (Railway Track) కారు నడుపుతూ యుతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై సుమారు 7 కిలోమీటర్ల మేరు కారు నడుపుతూ వెళ్లింది. గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాగులపల్లి వద్ద స్థానికులు కారును అడ్డుకున్నారు. దీంతో వారిని చాకుతో బెదిరించింది. అతికష్టం మీద ఆమెను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.
యువతి నిర్వాకంతో సుమారు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. కాగా, నిందితురాలుని లక్నోకి చెందిన రవికా సోనిగా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆమె మతిస్థిమితం కోల్పోయిందా, డ్రగ్స్ తీసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సుతోపాటు పాన్‌కార్డును సీజ్ చేశారు. ప్రస్తుతం ఆమెను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.