హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మహిళలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం సరైన వాటా దక్కడంలేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీలో మహిళా అభివృద్ధి, విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ… ‘మహిళా శక్తి- మహిళా హక్కులు’ అనే అంశంపై ప్రసంగించారు.
కాకతీయ వర్సిటీ వీసీ సీతారామారావు మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో స్త్రీని మించిన మహాశక్తి ఏదీ లేదని, స్త్రీ లేక పోతే ఈ సృష్టి లేదని అన్నారు. మహిళా సాధికారత, అభ్యున్నతి, వివక్ష నిర్మూలనపై తమ విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలను అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వీసీ గుర్తు చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ జీ పుష్ప చక్రపాణి, మహిళా అభివృద్ది విస్తరణ కేంద్రం ఇన్చార్జి డాక్టర్ జీ మేరీ సునంద, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు,మహిళా ఉద్యోగినులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.