వీణవంక/ చిగురుమామిడి, మే 2 : ‘ఇందిరమ్మ ఇండ్లు పైసలిచ్చినోళ్లకేనా.. పేదోళ్లకు ఇవ్వరా?’ అంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్, చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాల్లో శుక్రవారం పలువురు ఆందోళనలు చేపట్టారు. కోర్కల్ బస్టాండ్ వద్ద కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై మహిళలు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. అర్హులకు ఇండ్లు ఇవ్వాలని సుందరగిరి గ్రామ పంచాయతీ ఎదుట గ్రామస్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వారికి నచ్చిన వారి పేర్లే రాసుకుంటున్నారని మండిపడ్డారు. అటు అధికారులు, ఇటు కాంగ్రెస్ కమిటీ సభ్యులు అసలైన పేదవాళ్లను గాలికి వదిలేసి.. ఇప్పటికే సగం పూర్తయిన ఇళ్లకు మంజూరు ఇస్తున్నారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు రూ.20 వేలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలైన కాంగ్రెస్ వారికి కూడా దిక్కులేదని, డబ్బులు ఎవరిస్తే వాళ్లకే ఇండ్లు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
గాండ్లగూడెంలో ఇండ్ల సర్వే అడ్డగింత ; పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన నిరుపేదలు
అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 2 : భూములు, ట్రాక్టర్లు ఉన్న వారికే ఇండ్లు ఇస్తారా? నిరుపేదలు అర్హులు కాదా? సమాచారం ఇవ్వకుండా సర్వే కోసం ఎలా వస్తారు? అని ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం వాసులు సర్వేకు వచ్చిన పంచాయతీ కార్యదర్శిని శుక్రవారం అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఎవరు నియమించారు? వారు గ్రామంలో తిరిగి పేదలను గుర్తించారా? అని నిలదీశారు. ప్రభుత్వం 34 ఇండ్లు మంజూరు చేస్తే తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాసుకొని నిరుపేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం జీపీ ఎదుట ధర్నా ; అనర్హుల పేర్లు తొలగించాలని డిమాండ్
జూలూరుపాడు, మే 2 : ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లు తొలగించి అర్హులకే ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామస్థులు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఇండ్ల జాబితాలో తమకు అన్యాయం జరిగిందని మహిళలు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. భవనాలు, భూములు ఉన్న వారికి ఇండ్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన పేర్లు రాసుకొని కనీసం విచారణ చేపట్టకుండా అర్హుల జాబితాను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు ఇవ్వాలని పేదల ధర్నా ; జీపీ ఎదుట అఖిలపక్షం ఆందోళన
కురవి, మే 2: పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. గ్రామసభలో 120 మంది అర్హులను గుర్తించగా, ప్రభుత్వం 20 ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు తమకు నచ్చిన 20 మందిని ఎంపిక చేయడంపై ఆందోళన చేపట్టామని తెలిపారు. భూమి ఉండి, వేరే గ్రామాల్లో ఉన్న వారి పేర్లు తీసివేయాలని, స్థానిక పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇల్లు మంజూరయ్యేలా చూస్తాం ; బాధితుల రేకుల ఇంటిని పరిశీలించిన ఎంపీడీవో
నర్సింహులపేట, మే 2 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మీనారాయణ- ఉపేంద్ర రేకుల ఇంటిని ఎంపీడీవో యాకయ్య శుక్రవారం పరిశీలించారు. ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఫస్ట్ పేజీలో శుక్రవారం ‘కటిక పేదరికంలో ఉన్నాం, దండం పెడతాం.. మాకు ఇల్లు ఇవ్వండి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఎంపీడీవో వారి ఇంటి పరిస్థితిని పరిశీలించారు. నిరుపేద కుటుంబంలో ఉన్నవారికి ఇల్లు వచ్చేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు.
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ధర్నా ; పెద్దనాగారం గ్రామస్థుల ఆందోళన
నర్సింహులపేట, మే 2: అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం గ్రామస్థులు ధర్నా చేసి ఎంపీడీవో యాకయ్యకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామసభలో తమ పేర్లు చదివారని, ఇందిరమ్మ కమిటీ వచ్చిన తరువాత అవి లేకుండాపోయాయని వాపోయారు. భూస్వాములకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. అర్హుల జాబితాలో తమ పేరు లేకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ధర్నా ; బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం
ఎల్లారెడ్డి రూరల్, మే 2: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్‌కు చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయడానికి పంచాయతీరాజ్ డీఈఈ గిరిధర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. సోమార్‌పేట్‌కు 2023లో పది డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో ఆన్లైన్ కాలేదు. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. లబ్ధిదారులు రాజకీయనేతలు, అధికారుల వెంటపడగా పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చిలో ఆన్లైన్ పనులు కూడా అయిపోయాయి. బిల్లుల మంజూరుకు ఎంబీ చేయాలని శుక్రవారం డీఈఈ గిరిధర్ వద్దరకు వెళ్లి అడిగితే డబ్బులు అడుగుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల హామీతో ధర్నా విరమించారు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని డీఈఈ వివరించారు.